జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులు వస్తున్నాయి. ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట రహదారిని 4 లైన్లుగా మార్చనున్నారు. దీనికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకార్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతానికి శుభవార్త అందింది. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పర్యటనలో వెల్లడించారు. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ఈ ప్రాంతంలో రవాణా మెరుగుపడి, స్థానిక వ్యాపారాలకు, ప్రజల ప్రయాణానికి మరింత సౌకర్యంగా మారుతుంది.
శనివారం (నేడు) హుస్నాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్ (పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ) మరియు వాకిటి శ్రీహరి (బీసీ సంక్షేమం, మత్స్య అభివృద్ధి) కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చేప పిల్లల పెంపకంలో గత ప్రభుత్వంలో చిన్న చేప పిల్లలు పంపిణీ చేయడం వంటి కొన్ని పొరపాట్లు జరిగాయని విమర్శించారు.
హుస్నాబాద్‌లోని చెరువులకు ఇప్పుడు మూడు లక్షల చేప పిల్లలు ఇచ్చామని, మరో 60 వేల చేప పిల్లలు ఇవ్వాలని సంబంధిత మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఎల్లమ్మ చెరువుని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు చేపలు కొనుక్కునేలా అక్కడే ఒక చేపల మార్కెట్ ఉండాలని సూచించారు. అలాగే.. అసంపూర్తిగా ఉన్న మోడరన్ చేపల మార్కెట్‌ను వెంటనే పూర్తి చేయాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి కృషి చేస్తున్న గోపాల మిత్రల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, హుస్నాబాద్‌లో నిర్మించే వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించాలని.. ఒక వెటర్నరీ పోస్టును వెంటనే మంజూరు చేయాలని మంత్రి శ్రీహరికి వినతి పత్రం సమర్పించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 122.22 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో భాగంగా.. రాష్ట్రంలోని 26 వేల చెరువుల్లో ఉచితంగా 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేశామని వివరించారు.
తెలంగాణలోని ఐదు లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని.. చేపల ఉత్పత్తి కేంద్రాలని పెంచి, గణనీయంగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. గుర్తింపు పొందిన మత్స్యకారులకు రూ. 1.40 లక్షలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీహరి ఆకాంక్షలకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి సహకారంతో గురుకుల హాస్టల్స్ మధ్యాహ్న భోజన మెనూలో చేపల వంటకాన్ని (చేపల కూర) అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
