మద్యం, మందు చుట్టూ ఏ ఎన్నికైన ఉంటుందని జగద్వితం. ఆ రెండింటినీ అందించే నాయకుని కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్వేషణలో పడిందట. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న స్రవంతిరెడ్డి పూర్తి స్థాయిలో నిధులను సమీకరించలేని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా నిధులను సమకూర్చాల్సిన పీసీసీ దాదాపుగా చేతులెత్తేసిందని గాంధీభవన్ వర్గాల టాక్.
మునుగోడు ఉప ఎన్నిక గురించి పీసీసీ కీలక నేతలు మంగళవారం సమావేశం అయిన సందర్భంగా నిధుల అంశం చర్చకు వచ్చిందట. ఆ సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. అందరూ కలిసి విరాళాలు సేకరించడం ద్వారా ఉప పోరును ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారని సమాచారం. ఒక్క పైసా కూడా సొంత డబ్బును ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడంతో అక్కడున్న సహచర లీడర్లు అవాక్కయ్యారని వినికిడి.
వాస్తవంగా చలమల కృష్ణా రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల బరిలో దింపాలని రేవంత్ రెడ్డి యోచించారు. ఆ మేరకు ఢిల్లీ ఏఐసీసీకి కూడా నివేదిక అందించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ తో సహా పలువురు వ్యతిరేకించారు. ఆ తరువాత అభ్యర్థి ఎంపిక కోసం ఒక కమిటీని వేయడం ద్వారా కృష్ణారెడ్డి, స్రవంతిరెడ్డి పేర్లను ఢిల్లీకి పంపారు. ఫైనల్ గా స్రవంతిరెడ్డికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ప్రాబల్యం ఏఐసీసీ వద్ద తగ్గిందని ప్రచారం జరిగింది.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాత్రం సమావేశాలను నిర్వహిస్తూ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ, నిధుల విషయంలో వెనుక్కు తగ్గినట్టు తెలుస్తోంది. కనీసం రూ. 6కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసిన కాంగ్రెస్ ఆ మేరకు నిధులను సమీకరించుకోలేని పరిస్థితుల్లో ఉందని గాంధీభవన్ వర్గాల్లోని చర్చ. ఆ విషయంలో రేవంత్ రెడ్డి చేతులెత్తయడంతో పీసీసీ సమావేశంలో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి ఎందుకోసం ఇచ్చినట్టు అంటూ కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ప్రతిగా డబ్బు పెట్టడానికి తాను సిద్ధంగాలేనని ఖరాకండిగా రేవంత్ చెప్పాడని కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లోని సీరియస్ చర్చ. డబ్బు పెట్టాల్సి వస్తే, పీసీసీ పదవి వదులుకోవడానికి సిద్ధమనే సంకేతాలు సీనియర్లకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు సీనియర్లు రేవంత్ వాలకంపై నోరెళ్లబెడుతుంటే, స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సోదరునికి మద్ధతు ఇస్తానని ప్రైవేటు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ కీలక లీడర్లుగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టే `భారత్ జోడో యాత్ర` కో ఆర్డినేషన్ బిజీలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సీనియర్ నేత జానారెడ్డి మౌనంగా పరిణామాలను గమనిస్తున్నారు. మునుగోడు ఎన్నికల తరువాత సంచలన నిర్ణయాన్ని వెల్లడిస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిధుల అంశంపై రేవంత్ రెడ్డి నైస్ గా తప్పుకున్న అంశం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎవరికి వారే ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలక లీడర్లు తమదైన శైలిలో వెన్నుపోటుకు సిద్దమైన పరిస్థితుల్లో స్రవంతి రెడ్డి ఒంటరిపోరు ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.