Site icon HashtagU Telugu

Shock To BRS: బీఆర్ఎస్‌కు షాక్‌.. మాజీ ఎమ్మెల్యే గుడ్ బై !

Whatsapp Image 2022 10 06 At 5.37.52 Pm

Whatsapp Image 2022 10 06 At 5.37.52 Pm

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఆదిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ షాక్ తగిలింది. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సెప్టెంబర్ 9న బీజేపిలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్య యాదవ్ బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

గురువారం పరకాలలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి మీడియా సమావేశం నిర్వహించి ఈ నెల 9వ తేదీన బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నుంచి బిక్షపతి చురుకైన పాత్ర పోషించారు. గతంలో పరకాల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా, పరకాల జెడ్పీటీసీగా పని చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో మాజీ మంత్రి కొండా సురేఖ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బిక్షపతి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

కొన్నేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బిక్షపతి ఇప్పుడు అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న బిక్షపతి సన్నిహితుల్లో కొందరు కూడా మొలుగురి వెంట బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి కొద్ది రోజుల క్రితం బీజేపీ చేరికల కమిటీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసి బీజేపీలో చేరడంపై చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో బిక్షపతి టీఆర్ఎస్‌ను వీడటం చర్చనీయమైంది. సమావేశంలో బిక్షపతి వెంట పరకాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రాజభద్రయ్యతో పాటు మరికొందరు పాల్గొన్నారు.