Site icon HashtagU Telugu

Bandi Sanjay: ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లింపులెప్పుడు? సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ!

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని తుడిచిపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికే నిదర్శనమని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేయడం వల్ల ప్రైవేట్ కాలేజీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి చేరాయని, అధ్యాపకులకు జీతాలు, భత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కారణంగా ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడుతున్నాయని హెచ్చరించారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించనందున, కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దాంతో విద్యార్థులు మరియు యాజమాన్యాల మధ్య వాగ్వాదాలు ఏర్పడి, పోలీస్ స్టేషన్ల దాకా కేసులు వెళ్తున్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికపై బకాయిలను వన్ టైం సెటిల్‌మెంట్ చేస్తామన్నారు, తర్వాత 12 వాయిదాల్లో చెల్లిస్తామని మరో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ హామీలను విస్మరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే బకాయిల చెల్లింపును ప్రారంభిస్తామని చెప్పిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు మరియు కళాశాలల మనుగడను దృష్టిలో ఉంచుకుని తక్షణమే బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. విద్యారంగంపై ప్రభుత్వం చూపుతున్న అలసత్వం లక్షలాది మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతోందని తీవ్రంగా విమర్శించారు.