Malaysia: మలేషియాలో చిక్కుకున్న 80 మంది తెలుగు ప్రజలు

  • Written By:
  • Publish Date - December 10, 2022 / 01:30 PM IST

మలేషియా (Malaysia) ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో తెలంగాణకు చెందిన 80 మందితో సహా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. భారతీయులు మలేషియా(Malaysia) లో 10 రోజులుగా చిక్కుకుపోయారు. నవంబర్ 30న కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగిన వారి వద్ద సరైన పత్రాలు లేవని మలేషియా అధికారులు గుర్తించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి సుమారు 80 మంది విదేశాలలో ఉపాధి కోసం ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించారు. మలేషియా విజిట్ వీసా కోసం ఏజెంట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.

నాలుగు రోజుల క్రితం కౌలాలంపూర్‌లోని భారత రాయబార కార్యాలయానికి తాము ఈ మెయిల్ పంపామని, అయితే స్పందన రాలేదని కౌలాలంపూర్ విమానాశ్రయం నుండి వాట్సాప్ కాల్ ద్వారా దండగుల మల్లేష్ తెలిపారు. అతని ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అధికారులు కార్మికులను ఏకాంత ప్రదేశానికి తరలించారు. కాల్స్ చేయడానికి, ఈమెయిల్స్ పంపడానికి ఇంటర్నెట్ సౌకర్యం లేదని, నెట్ వర్క్ సమస్యల కారణంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను సంప్రదించలేకపోతున్నామని తెలిపారు.

వలస కూలీలను ట్రావెల్ ఏజెంట్లు మోసం చేశారని మల్లేష్ అన్నారు. “మేము భారతదేశానికి తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నాం. మేము సురక్షితంగా తిరిగి రావడానికి సహాయం కోరుతున్నాము. మా సెల్ ఫోన్ నంబర్లు ఇక్కడ పని చేయడం లేదు. మేము వాట్సాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాము” అని ఆయన వివరించారు.

Also Read: YCP Plan : బీజేపీ ప‌న్నాప్ర‌ముఖ్ జ‌గ‌న్ కాపీ! ఎన్నిక‌ల‌కు గృహ‌సార‌థులు!

కాగా.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వద్ద చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యను లేవనెత్తారు. కార్మికులను రక్షించాల్సిందిగా కౌలాలంపూర్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎస్. జైశంకర్ ఆదేశించారు. భారత హైకమిషనర్ బి.ఎన్‌తో కూడా ఎంపీ మాట్లాడారు. మలేషియాలో చిక్కుకుపోయిన 80 మందిలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు చెందిన 30 నుండి 40 మంది ఉన్నట్లు సమాచారం. వీరందరూ వీలైనంత త్వరగా భారత్ కు తిరిగి వస్తారని ఎంపీ అరవింద్ తెలిపారు.