Dengue Cases : ఖ‌మ్మంలో డెంగ్యూ టెర్ర‌ర్‌… ఇప్ప‌టి వ‌ర‌కు 66 కేసులు న‌మోదు

ఖమ్మం జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తుంది. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 09:00 PM IST

ఖమ్మం జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తుంది. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. సీజ‌న‌ల్ వ్యాధులు పెరుగుతుండ‌టంతో ఖ‌మ్మంలో జిల్లా అధికారులతో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. ఇది డెంగ్యూ దోమలు విజృంభించే సమయమని.. ఆగస్టు నెల అత్యంత కీలకమైనదని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే ప్రక్రియ చేపట్టడంతో పాటు పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆధికారుల‌ను ఆదేశించారు. దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు లోతట్టు ప్రాంతాలు, కాలువల్లో నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీ రెండు లక్షలకు తగ్గకుండా ఆయిల్ బాల్స్ సిద్ధం చేయాలని, డ్రై డే, పారిశుధ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అజయ్‌కుమార్‌ సూచించారు.బ‌జిల్లాలో డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని, డ్రైడే ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గౌత‌మ్ తెలిపారు. 2019లో దాదాపు 2000 డెంగ్యూ పాజిటివ్ కేసులు, 2020లో 23 కేసులు, 2021లో 944 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. జిల్లాలో 2022లో ఇప్పటివరకు దాదాపు 66 కేసులు నమోదయ్యాయని, పాజిటివ్‌ కేసు నమోదైన చుట్టుపక్కల 50 ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల నమూనాలను పరీక్షించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేవారు, సిబ్బందికి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 19,012 నమూనాలు సేకరించగా వాటిలో 487 పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో అవసరమైన అన్ని మందులు స్టాక్‌లో ఉన్నాయని తెలిపారు.