Site icon HashtagU Telugu

KTR’s intervention: మంత్రి కేటీఆర్ చొరవతో స్వస్థలాలకు చేరుకున్న దుబాయ్‌ బాధితులు..!

Gulf Ktr

Gulf Ktr

తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి రోడ్డున పడ్డారు. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ చొరవతో తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు ఆ యువకులు. 20 రోజుల క్రితం దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులను భారత్‌కు వెళ్లేందుకు దుబాయ్ అధికారులు నిరాకరించారు. దింతో విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి కెటిఆర్ చొరవ తీసుకోవడంతో ఆ యువకులు గురువారం రాత్రి తమ ఇళ్లకు చేరుకున్నారు. వీరిలో నలుగురు యువకులు రాజన్న సిరిసిల్లకు చెందినవారు కాగా.. ఒకరు పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. వారు ఇంటికి చేరుకోగానే వారు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దుబాయ్‌లో తమకు ఎదురైన కష్టాలను వివరిస్తూ అక్టోబర్ 9న యువకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు వీడియో సందేశం పంపిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సహకరించాలని మంత్రిని కోరారు. మంత్రిని ట్యాగ్ చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి వారు తమ ఇళ్లకు చేరుకునే ఏర్పాట్లు చేశారు. వారిని ఇళ్లకు తీసుకురావటానికి అయ్యే అన్ని ఖర్చులను మంత్రి భరించారు.

వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన గుగులోత్ అరవింద్, యల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన పెద్దోళ్ల స్వామి, చందుర్తి మండలానికి చెందిన అనిల్, రాజన్న-సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన బీ. రాములు, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగపల్లికి చెందిన నరేందర్ ఉద్యోగాల కోసం దుబాయ్‌కు వలస వెళ్లారు. సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్‌లోని కొందరు ‘గల్ఫ్ ఏజెంట్ల’ ద్వారా ఇంటర్వ్యూలకు హాజరై దుబాయ్‌కి చెందిన ఓ కంపెనీలో జీతం మాట్లాడుకొని ఉద్యోగాలకు వెళ్లారు. అయితే వారికి ఇంటర్వ్యూల సమయంలో చెప్పిన వేతనాలు అందలేదు. ఇదేమని కంపెనీ యాజమన్యాన్ని వారు ప్రశ్నించగా.. మద్యం సేవించి బీభత్సం సృష్టిస్తున్నారంటూ కంపెనీ వారిపై పోలీసు కేసు నమోదు చేసింది.

పోలీసు కేసు తర్వాత కూడా యువకులు తమ నిరసనను కొనసాగించడంతో సంస్థ అధికారులు స్వంతంగా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసుకుంటే భారతదేశానికి తిరిగి పంపడానికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కంపెనీ వారిని అక్టోబర్ 8న వారి పాస్‌పోర్ట్‌లతో ఎయిర్‌పోర్ట్‌లో దింపింది. అయితే వారిపై పోలీసు కేసు నమోదవడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు వారిని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించలేదు.