Site icon HashtagU Telugu

CM Vs Governor: ప్రగతిభవన్ Vs రాజ్ భవన్.. ఏం జరుగుతోంది!

tamilisai and cm kcr

tamilisai and kcr

తమిళసై కన్నా ముందు తెలంగాణకు నరసింహన్ గవర్నర్ గా ఉండేవారు. ఆయనకు, కేసీఆర్ కు మధ్య సత్సంబంధాలే ఉండేవి. కేసీఆర్ కూడా తరచుగా కలుస్తుండేవారు. కానీ నరసింహన్ తరువాత తెలంగాణకు
తమిళసై సౌందరరాజన్ గవర్నర్ గా వచ్చారు. గతంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. తరువాత తెలంగాణకు గవర్నర్ గా వచ్చారు. కానీ నరసింహన్ కాలంలో ప్రగతిభవన్ కు, రాజ్ భవన్ కు
మధ్య కనిపించిన సత్సంబంధాలు.. తరువాతి కాలంలో తగ్గిపోయాయి. ఆ ఎమ్మెల్సీ నియామకం నుంచీ ఇలా జరుగుతోందన్న చర్చ నడుస్తోంది.

ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి నియామకంతో మొదలయ్యిందా?

ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి నియామకానికి ఆమోద ముద్ర వేసే విషయంలో మొదలైన విభేదాలు.. తరువాత నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. తమిళసై వచ్చిన కొత్తలో ప్రభుత్వంతో మంచి బంధమే ఉండేది. కానీ రానురాను అంశాల వారీగా విభేదాలు మొదలయ్యాయి. దానికి మరికొన్ని పరిణామాలు జతకలిశాయి. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి చేసిన మంత్రిమండలి సిఫార్స్ కు రాజ్ భవన్ ఓకే చెప్పలేదు. దీనికి కారణం.. కౌశిక్ రెడ్డిపై ఉన్న కేసులని.. ఈ విషయంపై కేసీఆర్ తో తమిళసై మాట్లాడారని తెలుస్తోంది.

ప్రొటెం స్పీకర్ జాఫ్రీని ప్రతిపాదించిన అంశంలోనూ…

శాసనమండలి ప్రొటెం స్పీకర్ విషయంపైనా ప్రగతిభవన్ Vs రాజ్ భవన్ గానే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే.. ప్రభుత్వమేమో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం పార్టీకి చెందిన అమీనుల్ జాఫ్రీ పేరును ప్రతిపాదించింది. కానీ ప్రొటెం స్పీకర్ అవసరమేంటంటూ గవర్నర్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన తరువాత సభ్యులంతా వచ్చాక.. ఛైర్మన్ ఎంపిక చేస్తామని.. ముందుగా ప్రొటెం స్పీకర్ గా జాఫ్రీని చేయాలనుకుంటున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చినా.. రాజ్ భవన్ వెంటనే ఆమోదముద్ర వేయలేదు. దీంతో మరికొంత అదనపు సమాచారాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.

జనవరి 26, గవర్నర్ ప్రసంగం

జనవరి 26నాటి ప్రసంగం విషయంపైనా ఇదే సీన్ కనిపించినట్టు తెలుస్తోంది. రాజ్ భవన్ లో ఆ రోజు జరిగిన కార్యక్రమానికి సీఎం కాని, మంత్రులు కాని వెళ్లలేదు. గత బడ్జెట్ సమావేశం సమయంలోనూ ఇంతే. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని కాకుండా.. రాజ్ భవన్ లో మరికొన్ని అంశాలను అదనంగా జోడించినట్టు సమాచారం.

యూనివర్సిటీలు వైస్ ఛాన్స్ లర్ల నియామకంపైనా..

యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలోనూ ఇదే తీరు. ప్రభుత్వం సమర్పించిన లిస్టును గవర్నర్ వెంటనే ఓకే చేయలేదు. మరింత సమాచారం అడిగారు. ఇది కూడా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేదాలకు దారితీసిందని ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదంటోంది ప్రభుత్వం. ఎందుకంటే.. ఐదు నెలల విరామం తరువాత శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి పాత సమావేశాలకు కొనసాగింపే కాని.. కొత్తవి కాదని.. అందుకే గవర్నర్ ప్రసంగం అక్కర్లేదని చెబుతోంది. కానీ తన ప్రసంగం తొలగించడంపై గవర్నర్ తమిళసై అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక బిల్లును ఆమోదానికి పంపిన సమయంలో తన ప్రసంగం ఉంటుందని చెప్పి.. ఇప్పుడు లేదన్నారన్నారు. ఈమేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేయడం కూడా జరిగింది.

మామూలు పరిస్థితుల్లో అయితే.. సమావేశాల మధ్య చాలా గ్యాప్ వస్తే.. కొత్త సమావేశం ఏర్పాటుచేస్తారు. ఇప్పుడు కూడా అయిదు నెలల విరామం ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం పాత సమావేశాన్నే కొనసాగిస్తామని చెప్పింది. నిజానికి గవర్నర్ ప్రసంగం గవర్నర్ కార్యాలయంలో తయారవ్వదు. ప్రభుత్వమే తయారుచేసి పంపిస్తుంది. అందుకే ఏడాదికాలంగా ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు సాధించిన విజయాలు, తరువాత ఏడాదికి సంబంధించిన లక్ష్యాలు, విధానాలను పొందుపరుస్తారు. గవర్నర్ ప్రసంగం కాని లేకపోతే సభ్యుల హక్కులకు సమస్య వస్తుందని.. ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం కోల్పోతారని గవర్నర్ తన ప్రకటనలో వివరించారు. ఇలా వివిధ అంశాలు.. రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం పెంచినట్టు తెలుస్తోంది.