Site icon HashtagU Telugu

MLC Kavitha: తెలంగాణలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు.. 30 లక్షల ఉద్యోగాలు

Mlc Kavitha

Mlc Kavitha

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మఠం బిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమితుడైన బిక్షపతికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనడానికి బిక్షపతి నిదర్శనమని తెలిపారు. గ్రామ స్థాయిలో కార్యకర్తగా పనిచేసిన బిక్షపతిని గుర్తించి సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పెద్ద మెజారిటీతో గెలిపించడానికి బిక్షపతి చేయుత, పదవి ఉపయోగపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తున్నామని వివరించారు. పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశం ఎక్కడా లేని విధంగా గత 9 ఏళ్లలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, దాని వల్ల 30 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. కాబట్టి పరిశ్రమల శాఖలోని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ముఖ్యమైనదని స్పష్టం చేశారు.

ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్ వెన్నుదన్నుగా పనిచేస్తుందని అన్నారు. కరోనా కన్నా ముందు రూ. 30 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్ ప్రస్తుతం రూ. 130 కోట్ల లాభాల్లో ఉందని, ఈ మొత్తం రూ. 1500 కోట్లకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో పనిచేసే విధానం తమదని, ఈ కార్పొరేషన్ ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని బిక్షపతికి కవిత సూచించారు.

Also Read: Delhi Lovers: రోడ్డు పై రెచ్చిపోయిన ప్రేమజంట, దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు