Telangana Assembly: ప్రతిపక్షాల ఆ నాలుగు అస్త్రాలను ఢీకొట్టడానికి కేసీఆర్ వ్యూహం అదేనా?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగనున్నాయి. అందులోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. నిజంగా ఇది అరుదైన ఘటనే. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు.

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 08:10 AM IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగనున్నాయి. అందులోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. నిజంగా ఇది అరుదైన ఘటనే. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు. 2014 నుంచి చూస్తే.. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇంత హాట్ హాట్ గా రాజకీయ వాతావరణం ఎప్పుడూ లేదు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు వీటిపై పడింది.

కేసీఆర్ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇదే చివరి ఛాన్స్. ఎందుకంటే వచ్చే ఏడాది డిసెంబర్ వరకే ప్రస్తుత శాసనసభకు గడువుంది. అంటే వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ పూర్తిస్థాయిలో ఉండే అవకాశం లేదు. దీంతో ఈ బడ్జెట్ లో ఎలాంటి వరాలు ప్రకటించనున్నారా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. కిందటేడాది అక్టోబర్ 8న సమావేశాలు ముగిశాక.. సభ ప్రోరోగ్ కాలేదు. అంటే అవే సమావేశాలను ఇప్పుడు కొనసాగిస్తు్న్నారని అర్థం.

సభ ప్రోరోగ్ కాలేదు కాబట్టే.. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను జరపవచ్చని ప్రభుత్వం భావించింది. కానీ ప్రభుత్వ ధోరణిపై తెలంగాణ గవర్నర్ తమిళసై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం లేకపోతే.. ప్రభుత్వ పనితీరుతోపాటు ప్రజలకు ఉన్న సమస్యల గురించి చర్చించే అవకాశం శాసనసభ్యులకు ఉండదన్నది గవర్నర్ అభిప్రాయం. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తోంది. దీంతో సమావేశాల్లో తొలుత ఈ అంశంపైనే చర్చించే అవకాశం ఉంది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ రాజకీయ యుద్ధం చేస్తున్నారు. అందుకే కిందటి నెలలో ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించినా కేసీఆర్ వెళ్లలేదు. పైగా జాతీయంగా రాజకీయ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తు్న్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి బండి సంజయ్.. ఇద్దరూ ప్రభుత్వ విధానాలపై విమర్శల యుద్ధం చేస్తూ.. ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరిగే ఛాన్సుంది. ఈ సెషన్ లో ప్రభుత్వం సాధించిన అభివృద్దిని, కేంద్రం నుంచి సాయం అందడం లేదన్న సమాచారాన్ని లెక్కలతో సహా వివరించడానికి అవకాశం ఉంది. అటు ప్రతిపక్షాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకపోవడం, డబుల్ బెడ్ రూంల నిర్మాణం, 317 జీవో రద్దు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి.

ఈసారి సభలో బీజేపీ బలం పెరిగింది. ఈటెల రాజేందర్ గెలుపుతో బీజేపీ శాసనసభ్యులు ముగ్గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏ ధోరణితో ఉంటారా.. ఆయన ఏ వైఖరిని తీసుకుంటారా అని చూస్తోంది. శాసనమండలి కొత్త ఛైర్మన్ ఎన్నికకు ఈ సెషన్ సమయంలోనే నోటిఫికేషన్ రావచ్చు.