బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 51 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది. ఈ వంతెనపై ఓ మహిళ సహా ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. వరద ఉధృతి కారణంగా ఖమ్మంలో కరుణగిరి వద్ద మున్నేరు వంతెన కంపించింది. నగరంలోని కవిరాజ్‌నగర్, వీడియోస్ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్ రోడ్డు, కాల్వ ఒడ్డు.. దాదాపు పదుల సంఖ్యలో కాలనీల్లోని వరద నీరు పోటెత్తింది. పలు చోట్ల వరదలో చిక్కుకున్నవారు.. సాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం నగరంలోని కల్యాణ్‌నగర్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. నడుముల్లోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు. ఇక జలదిగ్బంధంలో చిక్కుకున్న చాలామందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మున్నేరు పరీవాహక ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. పలు కాలనీల్లో అనేక ఇల్లు మునిగిపోయాయి.
ప్రస్తుతం ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలో మొత్తం 39 కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 21 కేంద్రాలలో 7వేల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారికి అధికారులు, స్థానిక నాయకులు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇటు నల్గొండ జిల్లాలోని రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రవహించడంతో ఆంధ్రా వైపున వచ్చే రహదారి మార్గంలోని పాలేరు బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలను ఆధికారులు పూర్తిగా నిలిపివేశారు. బ్రిడ్జి తెగిపోవడంతో కోదాడ వైపు వెళ్లే ప్రజలు, వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also : Australia Rains: ఆస్ట్రేలియాలో తుఫాన్ బీభత్సం, మహిళ మృతి