35,000 Crore Investments: పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు, 51 వేల మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి

రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పరిశ్రమల్లో ఆధునిక కాలుష్య నియంత్రణ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా అనుమతులు ఇచ్చినప్పుడే నిబంధనలు విధించనున్నట్టు వివరించారు.

Published By: HashtagU Telugu Desk
35,000 Crore Investments

35,000 Crore Investments

35,000 Crore Investments: తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు దేశ ప్రథమ ప్రధాని, ప్రజాస్వామ్య దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

పది నెలల కాలంలో రూ.35,820 కోట్ల పెట్టుబడులకు (35,000 Crore Investments) ఒప్పందాలు జరిగాయని ఆయన తెలిపారు. 141 దేశీయ, బహుళ జాతి కంపెనీలు ఔషధ, టీకాలు, లైఫ్ సైన్సెస్, పరిశోధన రంగాల్లో నిర్మాణాలు మొదలు పెట్టడం, పూర్తి చేసుకుని ఉత్పాదన మొదలు పెట్టే దశల్లో ఉన్నాయని చెప్పారు. విస్తరణ పనులు చేపట్టన కంపెనీలు ఉత్పాదన ప్రారంభించాయని వివరించారు. ఇవన్నీ పూర్తి అయితే 51,086 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని, మరో లక్షన్నర మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని శ్రీదర్ బాబు వెల్లడించారు. దేశంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువు అయిందని తెలిపారు.

Also Read: Group 4 Final Results: తెలంగాణ గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుద‌ల.. లిస్ట్ ఇదే!

రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పరిశ్రమల్లో ఆధునిక కాలుష్య నియంత్రణ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా అనుమతులు ఇచ్చినప్పుడే నిబంధనలు విధించనున్నట్టు వివరించారు. ఏషియాలోనే మూడో అతి పెద్దదైన జపాన్ కు చెందిన టకెడా లైఫ్ సైన్సెస్ సంస్థ స్థానిక బయోలాజికల్ ఈ(BE)తో కలిసి ఏటా 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు.

వీటిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద పశు వైద్య సంస్థ జోయెటిస్ ఇటీవలే జిసిసి ని ప్రారంభించిందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బయోటెక్నాలజీ కంపెనీ యామ్ జెన్ (Amgen) 3,000 మందికి ఉద్యోగులను నియమించుకునే జిసిసిని ప్రారంభించిందని వివరించారు. జోయెటిస్, యామ్ జెన్ సంస్థలు సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఒప్పందాలు చేసుకుని అతి కొద్ది కాలంలోనే జిసిసి సెంటర్లను ఏర్పాటు చేసాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.

రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రకటన

వచ్చే రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలకు సంబంధించిన విధాన ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి చేస్తారని శ్రీధర్ బాబు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా దీనికి సంబంధించిన పాలసీ రూపొందించలేదని తెలిపారు.

ప్రజల డిమాండ్లు నెరవేర్చాకే భూసేకరణ చేపడతాం

ఫార్మా క్లస్టర్ల భూ సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారు అంగీకరిచిన తర్వాతే పనులు చేపడతామని చెప్పారు. సమస్యలేమైనా ఉంటే రైతులు అధికారుల ముందు వెల్లడించాలని శ్రీధర్ బాబు కోరారు. ప్రతిపక్షాల కుట్రలకు, రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు. పదేళ్ల కాలంలో తామెన్నడూ అధికారుల పైన దాడులకు ఉసిగొల్పే కుట్రలకు పాల్పడలేదని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ఏ శక్తినీ ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, టీజీఐఐసి సిఇఓ మధుసూదన్ లు పాల్గొన్నారు.

  Last Updated: 14 Nov 2024, 07:36 PM IST