Telangana Rising Summit: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Summit)’ను విజయవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా అతిథులను ఆహ్వానించాలని యోచిస్తోంది. ఈ సదస్సు “కమ్, జాయిన్ ది రైజ్” (Come, Join the Rise) అనే నినాదంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర యంత్రాంగం ఈ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగ ప్రముఖులను ఆహ్వానించాలని ప్రణాళిక వేస్తోంది. మాజీ యూకే ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, యూఏఈ రాజకుటుంబ సభ్యులు, బహుళజాతి సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి తరపున ఆహ్వానాలు జారీ చేయబడుతున్నాయి. ఆహ్వాన పత్రంలో ఉన్న సందేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “వికసిత్ భారత్-2047 లక్ష్యం కింద నిర్దేశించిన వృద్ధి రేటును సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసింది. సమతుల్య వృద్ధి, అన్ని వర్గాల ప్రజలకు సాధికారత, సంక్షేమం, అన్ని రంగాలలో పురోగతిని సాధించడానికి తెలంగాణ ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ఈ ప్రణాళికలు, లక్ష్యాలను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శించడం జరుగుతుంది. దయచేసి హాజరు కాగలరు” అని రాసినట్లు తెలుస్తోంది.
Also Read: Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పినట్లేనా?!
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆహ్వానితులలో చాలా మంది ఇప్పటికే తమ రాకను ధృవీకరించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడానికి, ప్రపంచ ఆవిష్కరణలలో తెలంగాణ స్థానాన్ని హైలైట్ చేయడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈవెంట్ సందర్భంగా అంతర్జాతీయ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
