30 Students Hospitalised: కల్వకుంట్ల ‘విషం’.. అర్ధాకలితో పేద పిల్లలు!

తెలంగాణలోని పలు గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో పిల్లలకు అందించే భోజనం కల్తీమయంగా మారుతోంది.

  • Written By:
  • Updated On - August 1, 2022 / 01:55 PM IST

తెలంగాణలోని పలు గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో పిల్లలకు అందించే భోజనం కల్తీమయంగా మారుతోంది. ఫలితంగా పిల్లలు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన 30 మంది బాలికలు కల్తీ ఆహారంగా కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా భెళ్లా మండల కేంద్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం భోజనం చేసిన విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. . సాయంత్రంలోగా బాలికలను డిశ్చార్జి చేస్తామని అధికారులు తెలిపారు. ఆహారంలో పురుగులు ఉన్నాయని, ఫలితంగా వాంతులతో బాధపడ్డామని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు.

వార్డెన్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిశుభ్రత పాటించి ఆహారాన్ని వండి పెట్టేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా అధికారులను కోరారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరుతూ బీజేపీ సోమవారం తెలంగాణ అధికార పార్టీ టిఆర్‌ఎస్‌పై విరుచుకుపడింది. చిన్న పిల్లలు విపరీతమైన నొప్పితో, ఆకలితో బాధపడుతుంటే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ అర్వింద్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. పిల్లలకు కనీసం బుక్కెడు బువ్వ పెట్టలేని సీఎం ఉన్నత పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించారు.