BRS Minister: తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడంలో కేటీఆర్ ది కీలక పాత్ర

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు

  • Written By:
  • Updated On - August 14, 2023 / 05:59 PM IST

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో,ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఐటి,పురపాలక,పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మేల్యేలు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, జాజాల సురేందర్,పలువురు జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులు,పేదలు రెండు కండ్లుగా కెసిఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారన్నారు. నాడు దండుగన్న వ్యవసాయాన్ని 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు,రైతు భీమా,సకాలంలో ఎరువులు,సాగునీరు అందించి కేసిఆర్ పండుగ చేశారన్నారు. నాడు 75లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే నేడు 3కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువులు పోలీస్ స్టేషన్లో అమ్మింది,గంటలు,రోజుల తరబడి నిలబడింది,చెప్పులు లైన్ కట్టింది రైతులు మర్చిపోగలరా అని అన్నారు. పొద్దున 3గంటలు రాత్రి 4గంటలు కరెంట్ ఇచ్చి రైతును గోస పెట్టిన కాంగ్రెస్…రైతు బాగు కోరుకుంటుందా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి కేసిఆర్ ఇచ్చే 24 గంటల ఉచిత కరెంట్ కావాలా…? 3 గంటలు చాలు అంటున్న కాంగ్రెస్ కావాలా..? రైతులు ఆలోచన చేయాలని మంత్రి కోరారు.

బాల్కొండ నియోజకవర్గం తర్వాత తాను ఎక్కువగా ఇష్టపడేది ఎల్లారెడ్డి నియోజకవర్గమే అని సహచర తెలంగాణ ఉద్యమకారుడైన సోదరుడు సురేందర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎల్లారెడ్డి అభివృద్దిలో పరుగులు పెడుతోందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తున్న సురేందర్ కు ఎల్లారెడ్డి ప్రజలు అండగా ఉండాలని ఈ సందర్బంగా మంత్రి వేముల పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధిలో కెటిఆర్ ది కీలక పాత్ర

కేసిఆర్ గారి మార్గనిర్దేశనంలో కెటిఆర్ గారి నాయకత్వంలో మున్సిపాలిటీలకు మహర్దశపట్టిందని మంత్రి వేముల అన్నారు. హైదరాబాద్ నగరానికి తీసిపోనట్టుగా జిల్లాలోని పట్టణాల్లో కూడా పెద్ద రోడ్లు,సెంట్రల్ లైటింగ్,ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడంలో కేటిఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. తన వాక్చాతుర్యంతో విదేశీ కంపెనీలు,పరిశ్రమలు తెలంగాణలో నెలకొల్పేందుకు మెప్పించి,ఒప్పించిన ఘనత కెటిఆర్ దే అని తద్వారా 3లక్షల కోట్ల పెట్టుబడులు,20వేల పరిశ్రమలు,16 లక్షల ఉద్యోగాల కల్పన సృష్టి కెటిఆర్ వల్లే సాధ్యం అయ్యిందని మంత్రి వేముల స్పష్టం చేశారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్ల నిధులతో అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీల వారిగా అభివృద్ది పనులకు మంజూరై,ఖర్చు చేస్తున్న నిధుల వివరాలు మంత్రి ఈ సందర్బంగా వివరించారు. మొత్తం 1751 కోట్ల నిధులు మున్సిపాలిటీల అభివృద్ది కోసం వెచ్చించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఆర్ కు వేముల దన్యవాదాలు తెలియజేశారు.