Telangana Elections : 17 లోక్‌సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు : సీఈఓ వికాస్ రాజ్

Telangana Elections :  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై కీలక వివరాలను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు. 

  • Written By:
  • Updated On - May 1, 2024 / 03:31 PM IST

Telangana Elections :  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై కీలక వివరాలను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు.  రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో  మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారిలో 285 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారని ఆయన తెలిపారు.  అత్యధికంగా సికింద్రాబాద్​ లోక్​సభ నియోజకవర్గంలో 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్​లో 12 మంది పోటీలో ఉన్నారని వివరించారు. మే 13న రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్ కూడా  జరగనుందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్  బరిలో 17 మంది అభ్యర్థులు ఉన్నారని వికాస్ రాజ్ చెప్పారు. ఈ లోక్‌సభ  ఎన్నికల్లో దాదాపు 2.95  లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు.  60వేల మంది పోలీసులు, 20వేల ఇతర రాష్ట్రాల బలగాలను మోహరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో వాడే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ స్టార్ట్ అయిందని ఆయన వెల్లడించారు. సిరిసిల్లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 16న గులాబీ బాస్ కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.తాజాగా కేసీఆర్ దానిపై వివరణ ఇచ్చారు. ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని  వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల వేళ ఫేక్ వీడియోలతో ప్రచారంపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరుగుతుందని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.ఆయన వెల్లడించిన ఇతర వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ ఎన్నికల ఏర్పాట్ల వివరాలివీ.. 

  • తెలంగాణ రాష్ట్రంలో 35809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో అత్యధికంగా 3226 పోలింగ్ కేంద్రాలు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో, అత్యల్పంగా 1689 పోలింగ్ కేంద్రాలు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్నాయి.
  •  రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
  • తొలిసారి ఓటు వేయబోతున్న వారు 9.20 లక్షల మంది.
  • రాష్ట్రంలో ఉమెన్ పోలింగ్ కేంద్రాలు 529 ఉన్నాయి.
  •  2.45 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేశారు.
  • ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24974 మంది అప్లై చేయగా 23248 మందికి అనుమతి ఇచ్చారు.
  • రాష్ట్రంలో 15970 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.

Also Read : Sundar Pichai : మన సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్.. ఎలా అయ్యారు ?

  • ఒక ఈవీఎంలో 15 మంది అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. మూడు ఈవీఎంలు అవసరమయ్యే లోక్‌సభ స్థానాలు 7, రెండు ఈవీఎంలు అవసరమయ్యే  స్థానాలు 9 ఉన్నాయి.
  • తెలంగాణ వ్యాప్తంగా 1.05 లక్షల బ్యాలెట్ యూనిట్ లు అవసరం. అయితే అదనంగా 35వేల బ్యాలెట్ యూనిట్లను రెడీ చేశారు.
  • మే 3 నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. మే 6కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
  •  47 శాతం లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే ఓటరుస్లిప్పుల పంపిణీ మొదలైంది.
  • ప్రజలు  1950 టోల్ ఫ్రీ, సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు.
  • ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి  18 వేల ఫిర్యాదులు రాగా 16వేలు పరిష్కరించారు.
  • ఎండలు బాగా ఉన్నందున మే 13న జరిగే పోలింగ్‌కు సంబంధించిన సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచమని పలు రాజకీయ పార్టీలు తెలంగాణ సీఈఓను కోరాయి. దీంతో ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు రాష్ట్రంలో నడుచుకుంటారు.
  • ఇప్పటివరకు తనిఖీల్లో రూ. 81 కోట్ల నగదు, రూ.46 కోట్ల విలువైన లిక్కర్, రూ.26 కోట్ల విలువైన డ్రగ్స్,  రూ.27 కోట్లు విలువైన ఇతర సామగ్రిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఇప్పటివరకు   7185 కేసులు నమోదు చేశారు.
  •  రాష్ట్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల నిఘా ఉంటుంది.

Also Read : Tragedy in Mumbai: ముంబైలో దారుణం.. టార్చ్ లైట్ వేసి ఆపరేషన్.. తల్లీబిడ్డ మృతి