Site icon HashtagU Telugu

Congress Vs TRS : 2023లో 2004 ఈక్వేష‌న్‌! కాంగ్రెస్,టీఆర్ఎస్ టై?

Congress list

రాజ‌కీయాల‌కు ఏదీ అతీతం కాదు. ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. బ‌ద్ధ శ‌త్రువులుగా వ్య‌వ‌హ‌రించిన పార్టీలు ఒక‌టై ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సంఘ‌ట‌న‌లు కాశ్మీర్ నుంచి తెలంగాణ వ‌ర‌కు అనేకం. వాటిని బేరేజు వేసుకుంటే, తెలంగాణ కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ఒక‌ట‌వుతుంద‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని కాద‌న‌లేం. ఆ రెండు పార్టీలు క‌లిసి 2023 ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోతున్నాయ‌ని ఢిల్లీ నుంచి గాంధీభ‌వ‌న్ వ‌ర‌కు టాక్ న‌డుస్తోంది.కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు కొంద‌రు కేసీఆర్ కు అనుకూలం. వాళ్ల‌ను కోవ‌ర్టులుగా ప‌లుమార్లు కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు లీడ‌ర్లు ప్ర‌స్తావించిన దాఖ‌లాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ల‌లో కొంద‌రు కేసీఆర్ తో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో ఉన్నారు. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతం లేకుండా ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్లి కేసీఆర్ ను క‌లిసిన సీనియ‌ర్లు ఉన్నారు. అలాంటి వాళ్ల మీద రేవంత్ వ‌ర్గీయులు త‌ర‌చూ కామెంట్లు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్ల ప్ర‌వ‌ర్త‌న‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని వాళ్లు ప‌దేప‌దే ప్ర‌శ్నిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా నెల‌కొన్ని ప‌రిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీతో క‌లిసి 2023 ఎన్నిక‌ల‌కు వెళితేనే బెట‌ర్ అనే అభిప్రాయానికి కొంద‌రు సీనియ‌ర్లు వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు వాళ్ల అభిప్రాయాన్ని కూడా ఢిల్లీ అధిష్టానంకు చేర‌వేశార‌ట‌. హుజూరాబాద్ ఫ‌లితాల త‌రువాత కాంగ్రెస్ అధిష్టానం కూడా సీనియ‌ర్ల మాట‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంద‌ని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ నాయ‌క‌త్వంపై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డాన్ని కూడా సీరియ‌స్ గా తీసుకుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌. పైగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో మ‌ళ్లీ లైజ‌నింగ్ చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని గులాబీ శ్రేణుల్లోని వినికిడి.న‌రేంద్ర మోడీ స‌ర్కార్ ను దించేయ‌డ‌మే ల‌క్ష్యంగా దేశ వ్యాప్తంగా కొన్ని పార్టీలు ఏకం కావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలో బీజేపీయేత‌ర పార్టీల‌ను క‌లుపుకుని పోవ‌డానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయింది. కానీ, టీఎంసీ అధినేత్రి మ‌మ‌త మాత్రం బీజేపీ, కాంగ్రెసేత‌ర ఫ్రంట్ అంటోంది. అదే మాట‌ను కేసీఆర్ కూడా వినిపిస్తున్నాడు. మ‌మ‌త‌, కేసీఆర్ కు కౌంట‌ర్ ఇచ్చేలా జైపూర్ వేదిక పై నుంచి కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు పిలుపునిచ్చారు. బీజేపీయేత‌ర పార్టీల‌ను క‌లుపుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే సామ‌ర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంద‌నే సంకేతాన్ని బ‌లంగా ఇచ్చారు.

Kcr

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నానాటికీ బ‌లం పుంజుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీని ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఇదే దూకుడుతో 2023కు వెళితే, గులాబీ విజ‌యంపై సందేహాలు క‌లిగే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే, బీజేపీకి బ‌ద్ధ శ‌త్రువుగా ఉండే కాంగ్రెస్ తో జ‌త క‌ట్టేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నించే ఛాన్స్ లేక‌పోలేదు. పైగా 2004 ఎన్నిక‌ల్లో క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లిన పార్టీలుగా కాంగ్రెస్‌, టీఆర్ఎస్ కు గుర్తింపు ఉంది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన‌, ఇచ్చిన పార్టీలుగా ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తారు. సో…తిరుగులేకుండా తెలంగాణ‌పై మ‌రోసారి విజ‌య‌కేత‌నం ఎగురేయ‌వ‌చ్చ‌ని టీఆర్ఎస్ అంచ‌నా వేయ‌డంలో త‌ప్పులేదు.
ఢిల్లీ పీఠం ఈక్వేష‌న్స్ ప్ర‌కారం టీఆర్ఎస్ అండ కాంగ్రెస్ పార్టీకి అవ‌స‌రం. రాష్ట్రంలో అధికారం లేక‌పోయిన‌ప్ప‌టికీ కేంద్ర పీఠంపై ఎక్కువ‌గా జాతీయ పార్టీలు దృష్టి పెడ‌తాయి. సో..కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీలు 2023 దిశ‌గా క‌లిసి అడుగులు వేస్తాయ‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారంలో నిజంలేద‌ని చెప్ప‌లేం!