Telangana Police : ‘యూఎన్ పీస్ మిషన్‌’కు 19 మంది తెలంగాణ పోలీసులు

తెలంగాణ పోలీసులకు మరో ఘనత దక్కింది.

  • Written By:
  • Updated On - June 20, 2024 / 01:14 PM IST

Telangana Police : తెలంగాణ పోలీసులకు మరో ఘనత దక్కింది. రాష్ట్రానికి చెందిన 19 మంది పోలీసు అధికారులు ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ దళం (యూఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్)కు ఎంపికయ్యారు. 22 మంది తెలంగాణ పోలీసు అధికారులు దీనికి సంబంధించిన పరీక్షను రాయగా.. 19 మందికి ఈ గొప్ప అవకాశం లభించింది. ఎంపికైన రాష్ట్ర పోలీసు అధికారుల్లో మాజిద్ అలీ ఖాన్ (ఏసీపీ),  అలెక్స్ (కమాండెంట్), విజయ్ కుమార్ (సీఐడీ ఇన్‌స్పెక్టర్), దేవేందర్ సింగ్ (ఎస్పీ), కే.ఎం.కిరణ్ కుమార్ (ఏసీబీ, హైదరాబాద్ సీసీఎస్),  శ్రీనివాసులు (హెడ్ కానిస్టేబుల్), యాదగిరి (హెడ్ కానిస్టేబుల్, ఆలేరు పీఎస్), సురేశ్ (ఇన్‌స్పెక్టర్, సైబరాబాద్), ప్రతాప్ (డీఎస్పీ విజిలెన్స్ విభాగం), నర్సింగ్ రావు (డీఎస్పీ, యాంటీ నార్కోటిక్ బ్యూరో), చల్లా శ్రీధర్ (డీఎస్పీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో),  శ్రీధర్ రెడ్డి (డీఎస్పీ, కోదాడ), జూపల్లి రమేశ్ (ఏసీపీ) ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

అంతర్యుద్దాలు జరుగుతున్న దేశాలు, శాంతిభద్రతలు లోపించిన దేశాల్లో తెలంగాణకు చెందిన ఈ పోలీసు అధికారులంతా ఏడాది పాటు విధులు నిర్వర్తించనున్నారు. అక్కడ శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు తమవంతుగా ప్రయత్నాలు చేయనున్నారు. తెలంగాణ నుంచి ఈ పోలీసు అధికారులు అంత ఈజీగా యూఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌కు ఎంపిక కాలేదు. ఇందుకోసం ఈ ఏడాది జూన్ 6 నుంచి 15 వరకు ఢిల్లీలో పరీక్షలు జరిగాయి. న్యూయార్క్ నుంచి వచ్చిన పోలీసు అధికారులు ఈ పరీక్షలను నిర్వహించారు. ఆంగ్లం, డ్రైవింగ్ , ఫైరింగ్ వంటి అంశాలలో పరీక్షలు పెట్టారు. దేశవ్యాప్తంగా 225 మంది పోలీసు అధికారులు ఈ పరీక్షలకు హాజరు కాగా.. 164 మంది పాసయ్యారు. వారిలో 19 మంది తెలంగాణవారు ఉన్నారు.

Also Read : Leaked NEET Paper : లీకైన ‘నీట్’ పేపర్.. ఎగ్జామ్‌లో వచ్చిన పేపర్ ఒక్కటే : అభ్యర్థి వాంగ్మూలం

ఐక్యరాజ్యసమితి తరఫున సేవలు అందించే అవకాశాన్ని దక్కించుకున్న ఈ పోలీసు అధికారుల మనోగతం మరోలా ఉంది. మనదేశంలో పోలీసులను రాజకీయ నేతల సేవలకు పరిమితం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి లాంటి గొప్ప సంస్థ తరఫున పనిచేసే అవకాశం దొరకడాన్ని చాలా గొప్ప విషయంగా వారు పేర్కొన్నారు.

Also Read :PM Kisan Samman Nidhi: 17వ విడుత పీఎం కిసాన్‌ నిధులు బ్యాంక్‌ అకౌంట్లోకి రాలేదా..? అయితే కారణమిదే..?