Site icon HashtagU Telugu

Dharani Vs Bhumata : భూమాత పోర్టల్‌లో ఆ కాలమ్ ఉంటుందా ? కొత్త మార్పులేంటి ?

CM Revanth Reddy

Revanth Dharani

Dharani Vs Bhumata : ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్‌‌ను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది.  కొత్తగా తీసుకురానున్న భూమాత పోర్టల్‌లో అనుభవదారు కాలమ్ ఉండాలా? వద్దా? అనే ప్రశ్నకు వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ ఐదుగురు కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఒకరేమో అనుభవదారు కాలమ్‌ను  తిరిగి కొనసాగించాలన్నారు. మరొకరేమో దాన్ని తొలగించి నాలుగేండ్లవుతుంది.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన రీ ఎంట్రీ చేస్తారని ప్రశ్నించారు. అయితే కౌలుదారుకు ప్రత్యేక పాసు పుస్తకాలేవీ ఇచ్చే ఆలోచన లేనట్లు సమాచారం. గతంలో అనుభవదారు కాలమ్ లో ఎవరి పేరు రాయాలన్నా ఆర్వోఆర్ రిజిస్టర్, చేర్పులు/మార్పుల రిజిస్టర్‌లో రాయాలని సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పుడు కూడా భూమాత పోర్టల్‌లో కోర్టు కేసులు, ఏజీపీఏ, జీపీఏ, అగ్రిమెంట్ వంటి అంశాలను చేర్చాలా? వద్దా? అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాదిరిగా టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకొచ్చే అవసరాన్ని గుర్తిస్తే మాత్రం ఇవన్నీ చేర్చాల్సి ఉంటుందని అంటున్నారు.

2014 నుంచి 2024 దాకా..

భూమాత పోర్టల్‌ను తీసుకొచ్చే ముందు ధరణి పోర్టల్‌పై (Dharani Vs Bhumata) రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయిలో రివ్యూ చేయనుంది. అందులోని లోపాలను అధిగమించేలా భూమాత పోర్టల్‌ను తీసుకురానుంది. గతంలో ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత కాస్తు కాలమ్/అనుభవదారు కాలమ్ తొలగించడం ద్వారా ఎన్ని లక్షల మందికి నష్టం జరిగింది? ఎన్ని లక్షల ఎకరాలు వదిలేసిన భూములను భూస్వాములు తిరిగి దక్కించుకున్నారు? వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్న భూ విస్తీర్ణం ఎంత? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో సర్కారు ఉంది. 2014 జూన్ 2 కటాఫ్ డేట్ ఆధారంగా ఆనాటి పహానీలను, 2024 పహాణీలను  పరిశీలించి ఈ వివరాలన్నీ సేకరించాల్సి ఉంటుందని ధరణి కమిటీ భావిస్తోంది.

భూస్వాములు తిరిగొచ్చారు

రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించిన గత బీఆర్ఎస్ సర్కారు..  అందులో కాస్తు/అనుభవదారు/కల్టివేషన్ కాలమ్‌ను తొలగించిందనే ప్రచారం జరిగింది. ఆ కాలమ్‌ నుంచి తరతరాలుగా దున్నుకుంటున్న పేదల పేర్లను తీసేసిన సర్కారు పట్టాదారుల పేర్లను రాసింది. ఈ పరిణామం వల్ల అప్పట్లో  పట్టాదారు పాస్ బుక్‌లు జారీ కావడంతో ఎంతోమంది భూస్వామ్యులు మళ్లీ పల్లెల్లోకి అడుగు పెట్టి.. ఆయా భూములను దున్నుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. భూమి దున్నుకుంటున్న పేదలను అక్కడి నుంచి సాగనంపి.. ఆ ల్యాండ్‌ను రియల్టర్లకు అమ్మేశారు. రాష్ట్రంలోని చాలా జిల్లాలో అప్పట్లో ఇదే విధంగా జరిగిందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కౌలుదారు కోణంలోనే చూశారు

1 బీ, పహాణీలు ధరణి పోర్టల్‌లో వేర్వేరుగా రావడం లేదు. వాటిని ఆటో జనరేషన్‌ ఆప్షన్ కింద ఉంచారు. దాంట్లో అనుభవదారు కాలమ్ లేదు. ఆర్వోఆర్ 2020 యాక్టులోనూ ఆ కాలమ్ తొలగిస్తున్నట్లుగా లేదు.  అయినా ఎందుకు  తీసేశారు అన్న ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానం లేదు.  అనుభవదారు కాలమ్‌లో ఉన్నవారంతా కౌలుదారులు మాత్రమే కావాల్సిన అవసరం లేదు. వారసులు కావచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యుటేషన్ చేసుకోకుండా ఉండొచ్చు, అడ్వాన్స్ చెల్లించిన వారు, పెండింగ్ మ్యుటేషన్ కావచ్చు, సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసి ఉండొచ్చు.ఏనాడో భూమిని వదిలేసి వెళ్లిపోతే అక్కడే తరతరాలుగా దున్నుకొని బతుకుతున్న వాళ్లు కావచ్చు. ఇంకా అనేక కోణాల్లో ఈ కాలమ్‌లో పేర్లు నమోదై ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం కౌలుదారు అనే కోణం నుంచి మాత్రమే చూసిందన్న ఆరోపణలున్నాయి.

Also Read :Chiranjeevi Meets Venkaiah Naidu : ఇద్దరు పద్మ విభూషన్లు కలిసిన వేళ..మెగా పిక్ అదిరి పోలే..