ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొరఢా ఝలిపిస్తోంది. నిబంధనలను పాటించని 165 ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసింది. ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు 106 ఆసుపత్రులకు జరిమానా విధించింది. తెలంగాణలోని 1,163 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 3,810 ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లను తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. జిల్లా అధికారులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు నివేదిక సమర్పించడంతో ఈ వివరాలు బయటకొచ్చాయి.
సీజ్ చేసిన ఆసుపత్రుల్లో అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఉండడం ఇక్కడ గమనించాలి. జిల్లాలో 54 ప్రైవేటు ఆసుపత్రులుండగా, 41 సీజ్ చేశారు. నల్గొండలో 17, సంగారెడ్డిలో 16, కొత్తగూడెంలో 15, హైదరాబాద్‌లో 10, రంగారెడ్డిలో ఒక్కో ఆసుపత్రులను సీజ్ చేశారు. హైదరాబాద్‌లో 274, కరీంనగర్‌లో 124, రంగారెడ్డిలో 107 ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు అందాయి. అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై తదుపరి చర్యలు తీసుకునేందుకు త్వరలో మరోసారి తనిఖీలు చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.