144 Section : సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని మియాపూర్, చందానగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ నెల 29 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన ప్రకటించారు. మియాపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. మియాపూర్ శివార్లలో వివాదాస్పదంగా మారిన భూములను అవినాష్ మహంతి స్వయంగా పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
శనివారం రోజు హైదరాబాద్ శివారులోని సర్కారు భూముల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2వేల మంది ఒక్కసారిగా యత్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్‌నగర్ సమీపంలో ఉన్న సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు వీరంతా ప్రయత్నించారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. దీంతో పోలీసులపైకి పలువురు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఈనెల 29వ తేదీ అర్థరాత్రి వరకు మియాపూర్, చందానగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ను(144 Section) విధిస్తూ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
Also Read : CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!
దేశ విభజన సందర్భంగా కొంతమంది అప్పట్లో పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయారు. అలాంటి భూములను చట్ట పరిభాషలో అవెక్యూ ల్యాండ్స్ అంటారు. అలాంటివి దాదాపు 525 ఎకరాల ల్యాండ్స్ మియాపూర్ శివార్లలో ఉన్నాయి. వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. అయితే ఈ భూములను తాము కొన్నామంటూ 32 మంది కోర్టును ఆశ్రయించారు. అయితే దిగువ కోర్టుల నుంచి హైకోర్టు దాకా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆ 32 మంది వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ప్రస్తుతం దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఈ విలువైన భూమికి సంబంధించిన కేసు ఉంది. ఈ అవెక్యూ భూమిలో దాదాపు 50 ఎకరాలు ఇప్పటికే కబ్జాలకు గురైందని తెలుస్తోంది.