Site icon HashtagU Telugu

Sangareddy Chemical Plant Explosion : 13 కు చేరిన మృతుల సంఖ్య

Sangareddy Chemical Plant E

Sangareddy Chemical Plant E

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ(Sangareddy Chemical Plant Explosion)లో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది కార్మికులు దుర్మరణం (13 dies) పాలయ్యారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని, దాదాపు 22 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు 90 మంది కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారని తెలుస్తోంది. ఉత్పత్తి విభాగానికి సంబంధించిన భవనం పూర్తిగా కూలిపోగా, ఇంకొన్ని భవనాలు సైతం ధ్వంసమయ్యాయి.

Gold in India : ఇండియా ఒక బంగారు గని.. ఎన్ని నిల్వలు ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Modi), తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, కార్మికులను కాపాడేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ సైతం బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన కార్మికులను చందానగర్‌, ఇస్నాపూర్‌ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 11 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. పరిశ్రమ నుంచి వెలువడుతున్న ఘాటైన వాసనల వల్ల పరిసర ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌లు పరిశీలించి సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి పరిశ్రమకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. భవన శిథిలాలు పూర్తిగా తొలగించిన తర్వాతే మరికొంతమంది కార్మికుల పరిస్థితిపై స్పష్టత రానుందని అధికారులు తెలిపారు.