125 Ft Statue: హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత రాజసం… ప్రత్యేకతలు ఇవే

భారత రాజ్యాంగ సృష్ఠి కర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో 125 అడుగుల భారీ విగ్రహం ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • Written By:
  • Updated On - April 14, 2023 / 01:38 PM IST

125 ft Statue:  భారత రాజ్యాంగ సృష్ఠి కర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో 125 అడుగుల భారీ విగ్రహం ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం మధ్యాహ్నం దీనిని ప్రారంభించనున్నారు. ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏప్రిల్ 14 , 2016 లో ఈ విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేశారు. 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం. భూమి నుండి 175 అడుగుల ఎత్తు. పీఠం ఎత్తు 50 అడుగులుగా ఉంది.

ఇది దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. 2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం పనులు చేపట్టారు. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు. 791 టన్నుల స్టీల్ . 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి దీని తయారీలో వినియోగించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహం రూపకల్పన చేశారు. రూ.146 .50 కోట్లు దీని కోసం వెచ్చించారు. 425 మంది.శ్రామికులు పని చేయగా.. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వంజి సుతార్.
మహారాష్ట్రలోని ధూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన రామ్ వి సుతార్ ఈ విగ్రహం రూపొందించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి నిదర్శనంగా గుజరాత్‌లోని నర్మదా నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేసింది కూడా ఈయనే. రామ్ వి సుతార్, ఆయన తనయుడు అనిల్ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు.

36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనంతో పాటు రాక్ గార్డెన్ నిర్మించారు. ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ఎంట్రెన్స్, వాటర్ ఫౌంటేన్స్ , సాండ్ స్టోన్ వర్క్, జిఆర్‌సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్ సౌకర్యం ఉంది. విగ్రహానికి చేరుకోడానికి మెట్ల దారి, ర్యాంప్ నిర్మించారు. విగ్రహం కింద పీఠం లోపల గ్రంథాలయం ఏర్పాటు చేసి దానిలో అంబేద్కర్ రచనలు అందుబాటులో ఉంటాయి.బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్ కూడా ఉంది. మొత్తం ఫాల్స్ సీలింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ స్మృతి వనంలో దాదాపు 450 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విగ్రహ ఏర్పాటుతో హైదరాబాద్ లో మరో టూరిస్ట్ స్పాట్ అందుబాటులోకి వచ్చిందనీ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

కాగా అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ప్రారంభోత్సవం బౌద్ధ సంప్రదాయంలో చేస్తారు. విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం కేసీఆర్‌ ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 30 మంది బౌద్ధగురువులు సీఎంను ప్రార్థనలతో విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. తర్వాత స్తూపం లోపల ఉన్న లిఫ్టులో కేసీఆర్ అంబేడ్కర్‌ విగ్రహం పాదాల వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు.125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సరిపోయేంత భారీ పూలమాలను.. చామంతి, గులాబీ, తమలపాకులతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. దాన్ని క్రేన్ సాయంతో అంబేడ్కర్ మెడలో వేయనున్నారు. విగ్రహావిష్కరణ తరువాత హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపిస్తారు.