Site icon HashtagU Telugu

BRS MLAs : నెల రోజుల్లో మరో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ?

Brs Mlas Jump To Congress

BRS MLAs : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది. ఆలోగా రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఆలోగా మరో 10 నుంచి 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరో 11 మంది వచ్చి చేరితే ఆ సంఖ్య 16కు పెరుగుతుంది. అయితే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు మరో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) అవసరం అవుతారు. రానున్న రోజుల్లో ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ  కసరత్తు చేస్తుందా ? ఎమ్మెల్యేలను నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ఏం చేస్తుంది ? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join

తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశమైన సీఎం రేవంత్.. పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితాను అందించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్ నేతల నేపథ్యం గురించి వివరించినట్లు సమాచారం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యేలోగా సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకునేలా రేవంత్ వ్యూహాన్ని రెడీ చేశారు. దీనిపై పార్టీ హైకమాండ్ ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందుకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ వైపు చేరికలను కొనసాగిస్తూనే.. మరోవైపు పార్టీ సీనియర్ నేతలకు ప్రయారిటీ తగ్గకుండా చూడాలని రేవంత్‌కు కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read :Owaisi – Jai Palestine : ఒవైసీపై అనర్హత వేటు వేయండి.. రాష్ట్రపతికి న్యాయవాది ఫిర్యాదు

తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా  లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను గెల్చుకుంది. ఈ తరుణంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ అంటున్నారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మనం చేర్చుకోకపోతే, బీజేపీలోకి వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ మరింత బలంగా మారే అవకాశాన్ని మనమే ఇచ్చినట్టు అవుతుంది’’ అని  కాంగ్రెస్ హైకమాండ్‌కు సీఎం రేవంత్ వివరించినట్టు టాక్. రేవంత్ అభిప్రాయంతో కాంగ్రెస్ పెద్దలు ఏకీభవించారని తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు పచ్చజెండా ఊపారని సమాచారం. విపక్ష ఎమ్మెల్యేల చేరికలను కొనసాగిస్తూ.. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలలో అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది.

Also Read :Russia Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీలు

Exit mobile version