Investment Scam: రూ. 900 కోట్ల స్కామ్‌.. చైనా జాతీయుడితో సహా 10 మంది అరెస్ట్‌..!

లక్షలాది మందిని మోసం చేసి 903 కోట్ల రూపాయల మేర మోసం చేసిన చైనీస్, తైవాన్ జాతీయుడు సహా పది మందిని హైద‌రాబాద్‌ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • Written By:
  • Updated On - October 12, 2022 / 06:44 PM IST

లక్షలాది మందిని మోసం చేసి 903 కోట్ల రూపాయల మేర మోసం చేసిన చైనీస్, తైవాన్ జాతీయుడు సహా పది మందిని హైద‌రాబాద్‌ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. 1.91 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి. ఎనిమిది మంది భారతీయులు బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు నగదు బదిలీ చేయడం ద్వారా ఈ స్కామ్‌ను సులభతరం చేసిన‌ట్లు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.

సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుండి నిర్వహించబడుతున్న కొన్ని కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. మొబైల్ అప్లికేషన్ల ద్వారా మోసపూరిత పెట్టుబడిదారులను మోసగిస్తున్న ఈ నకిలీ పెట్టుబడి కంపెనీల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేశారు. నిందితులు హవాలా స్కామ్‌ను బాంబే, ఢిల్లీ నుంచి నడుపుతున్నారు. వారిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సాహిల్ బజాజ్, సన్నీ అకా పంకజ్, వీరేందర్ సింగ్, సంజయ్ యాదవ్, నవనీత్ కౌశిక్, మహ్మద్ పర్వేజ్ (హైదరాబాద్ నుండి), సయ్యద్ సుల్తాన్ (హైదరాబాద్ నుండి), మీర్జా నదీమ్ బేగ్ (హైదరాబాద్ నుండి), చైనా జాతీయుడు లెక్ అకా లీ జాంగ్‌జున్, చు చున్-యు (తైవాన్ జాతీయుడు) ఉన్నారు.

భారీ పెట్టుబడి మోసంపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. LOXAM అనే ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లో 1.6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయానని ఓ ఫిర్యాదుదారుడు తెలిపారు. “ఫిర్యాదుదారుడి డబ్బును జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు దర్యాప్తులో తేలింది” అని క‌మిష‌న‌ర్‌ ఆనంద్ చెప్పారు.

ఈ బ్యాంకు ఖాతాను వీరేందర్ సింగ్ జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తెరిచారని.. వీరేందర్ సింగ్‌ను పూణేలో అదుపులోకి తీసుకుని విచారించగా.. జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచినట్లు వెల్లడించాడు. అయితే.. నగదు మార్పిడి కార్యకలాపాలకు సంబంధించి ఆర్‌బిఐ నిర్దేశించిన మార్గదర్శకాలను వీరు పదేపదే ఉల్లంఘించారని క‌మిష‌న‌ర్ తెలిపారు. సాహిల్, సన్నీ అకా పంకజ్ ఇతర నేర‌గాళ్ల‌తో చేతులు కలిపి డబ్బును హవాలా ద్వారా విదేశాలకు బదిలీ చేశారని తెలిపారు. 7 నెలల వ్యవధిలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు రూ.441 కోట్ల లావాదేవీలు పంపబడ్డాయి. కెడిఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలో మరో 462 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.