సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు కూడా ఉండొచ్చనే సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మక్కా నుంచి మదీనా వైపు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికి పైగా సజీవ దహనమయ్యారని సౌదీ స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో గణనీయ సంఖ్యలో హైదరాబాదీలు ఉన్నారన్న వార్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని సీఎస్, డీజీపీ, విదేశాంగ శాఖతో సమన్వయం చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో స్పష్టమైన సమాచారం వెంటనే అందించాలని సీఎంఓ ప్రత్యేకంగా ఆరా తీస్తోంది.
CV Anand : బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్
ప్రమాదంపై నిరంతర సమాచారాన్ని అందించేందుకు, బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందించేందుకు తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రెండు సహాయక ఫోన్ నంబర్లను విడుదల చేశారు: +91 79979 59754, +91 99129 19545. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వ్యక్తుల సంఖ్య, వారి వివరాలు, పాస్‌పోర్ట్ సమాచారం వంటి అంశాలను సేకరించి తక్షణమే కుటుంబాలకు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సౌదీ యాత్రకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ బంధువులు ప్రమాదంలో ఉన్నారేమోనని కొన్ని కుటుంబాలు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తోంది.
సౌదీ అరేబియాలోని బదర్–మదీనా ప్రాంతం మధ్య ముఫరహత్ వద్ద ఈ భయంకర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో నిండిన బస్సు వేగంగా వస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న సమయంలోనే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుని ప్రయాణికులు బయటపడే వీలు లేకుండా పోయింది. మృతుల్లో హైదరాబాద్‌లోని టోలిచౌక్, మల్లేపల్లి, బజార్‌ఘాట్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ప్రాథమిక సమాచారం. మల్లేపల్లి బజార్‌ఘాట్ నుంచే 16 మంది ఈ యాత్రకు వెళ్లారని తెలిసింది. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలను అదుపు చేసి శవాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యాయి. సౌదీ ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నాయి.
