నేటి రోజుల్లో సాధారణ మనిషి బ్రతికే రోజులు పోయాయి. సంపాదన కన్నా ఖర్చే ఎక్కువైంది. ఏది కొనాలన్నా వందల్లో , వేలల్లో ఉండడంతో సామాన్య ప్రజలు ఏది కొనుగోలు చేయాలన్న వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఈ కాలంలో ఒక్క రూపాయికే భోజనం అందజేస్తూ తన గొప్ప మనసు చాటుకున్నాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు, నిరాశ్రయుల కోసం మానవత్వంతో ముందుకు వచ్చిన మహానుభావుడు జార్జ్ రాకేశ్ బాబు. ఆయన ప్రారంభించిన అద్భుతమైన కార్యక్రమమే ‘కరుణ కిచెన్’. ఈ కిచెన్ యొక్క ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడం. ఇక్కడ నిరాశ్రయులు, రోజువారీ కూలీలు మరియు రైల్వే స్టేషన్‌లో ఆశ్రయం పొందుతున్న వారు కేవలం ఒక రూపాయి నామమాత్రపు ధరకే ఉదయం పూట టిఫిన్ పొందవచ్చు. ఈ చొరవ నిరుపేదలు ఆత్మగౌరవంతో ఆహారం తీసుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. రాకేశ్ బాబు మాటల్లోనే చెప్పాలంటే “ఇది డబ్బు కోసం కాదు, నలుగురి కడుపు నింపేందుకు, వారి ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టాను. ఇందులోనే నాకు నిజమైన సంతోషం ఉంది” అని తెలపడం ఆయన నిస్వార్థ సేవకు నిదర్శనం.
Telangana Rising Global Summit 2025 : సమ్మిట్ కు రాలేకపోతున్న ఖర్గే
సాధారణంగా ఇలాంటి సేవా కార్యక్రమాలలో ఒకే రకమైన ఆహారాన్ని అందించే పద్ధతి ఉంటుంది. కానీ, రాకేశ్ బాబు మాత్రం నాణ్యతకు, రుచికి పెద్ద పీట వేశారు. నిరాశ్రయులు కూడా మంచి, పోషకాలతో కూడిన ఆహారం తినాలనే ఉద్దేశంతో ‘కరుణ కిచెన్’లో ప్రతిరోజూ మెనూ మారుస్తారు. ఇడ్లీ, ఉప్మా, గుడ్డు, టీ, బ్రేడ్, అరటిపండు వంటి రకరకాల టిఫిన్స్ మరియు మధ్యాహ్నం భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. ఈ నాణ్యత మరియు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడంలో ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తారు. ప్రస్తుతం, ఈ ‘కరుణ కిచెన్’ ద్వారా రాకేశ్ బాబు రోజూ దాదాపు 300 మందికి పైగా పేదల కడుపు నింపుతున్నారు. ఈ సేవ రోజుకు రెండు విడతలుగా కొనసాగుతుంది: టిఫిన్ కోసం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం కోసం తిరిగి 1 నుంచి 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
‘కరుణ కిచెన్’ కార్యక్రమం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు గొప్ప స్ఫూర్తిని ఇస్తోంది. ప్రతిరోజు 300 మందికి పైగా ఆహారం అందించడం అనేది చిన్న విషయం కాదు. రాకేశ్ బాబు తన సొంత వనరులు మరియు దాతల సహకారంతో ఈ మహత్కార్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఈ అద్భుతమైన సేవకు తోడుగా నిలబడటం సామాజిక బాధ్యతగా భావించాలి. చాలా మంది మానవతా గల వ్యక్తులు తమకు తోచిన విధంగా రూ.10, రూ. 50, రూ.100 వంటి విరాళాలను ఇస్తున్నారు. మరికొందరు ముడి పదార్థాలను అందిస్తున్నారు. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఆశించకుండా, పేదవారి ఆకలి తీర్చేందుకు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం నిజమైన మానవతా విలువలు మరియు సేవా దృక్పథం ఎలా ఉంటుందో నిరూపిస్తుంది.
