Site icon HashtagU Telugu

CPI – CPM – Each 5 : చెరో 5 కావాలంటున్న వామపక్షాలు.. చెరో 2 ఇస్తామంటున్న కాంగ్రెస్ !

Narayana

Narayana

CPI – CPM – Each 5 :  తెలంగాణ అసెంబ్లీ పోల్స్ లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల బరిలోకి దూకాలని వామపక్షాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ కు తమకు ఎన్ని సీట్లను కేటాయిస్తుందనే అవి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా మంగళవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఐ, సీపీఎంలకు చెరో 5 అసెంబ్లీ సీట్లను కేటాయించాలని కాంగ్రెస్‌ కు ప్రతిపాదించామని చెప్పారు. ఈ అంశం నేరుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినప్పటికీ..  సీట్ల అవగాహన ఇంకా కుదరలేదని నారాయణ తేల్చి చెప్పారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర సమితి కార్యాలయంలో  మీడియాతో మాట్లాడుతూ..  నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒప్పుకోకుంటే.. ఒంటరి పోరాటమే 

చట్ట సభల్లో వామపక్షాల వాయిస్ ఉండాలని సీపీఐ, సీపీఎం కోరుకుంటున్నాయని నారాయణ చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తమతో చర్చలు జరుపుతున్నారని వివరించారు. కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థుల లిస్ట్ లో తాము ఆశించే స్థానాలను మినహాయిస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అలా జరగకుంటే.. బలంగా ఉన్న స్థానాల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వామపక్షాలు విడిగా పోటీ చేస్తున్న విషయాన్ని నారాయణ గుర్తుచేశారు. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో సీపీఐ, సీపీఎంలు కలిసి బలమైన స్థానాల్లో పోటీ చేస్తున్నాయని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

చెరో రెండే ఇస్తామంటున్న కాంగ్రెస్ ?

అయితే సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉందని తెలుస్తోంది. మునుగోడు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను  సీపీఐకి కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం.  మిర్యాలగూడ, భద్రాచలం అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కేటాయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. భద్రాచలంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరయ్యను  పినపాక నుంచి బరిలోకి దింపాలని హస్తం  పార్టీ  భావిస్తున్నట్టుగా  ప్రచారం (CPI – CPM – Each 5) జరుగుతోంది.

Also read : Vote From Home : వృద్ధులు, దివ్యాంగులు ఇక ఇంటి నుంచే ఓటు వేయొచ్చు

Exit mobile version