ఇప్పటి డిజిటల్ యుగంలో మన వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించుకోవడం చాలా కీలకం. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping ) అనేది ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతని కాల్స్, మెసేజ్లు, డేటా వంటి విషయాలను గోప్యంగా వినడం లేదా ట్రాక్ చేయడం. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్‌కు ప్రభుత్వం లేదా కొన్ని సంస్థలు అనుమతి ఉన్న సందర్భాల్లోనే చేయవచ్చు. కానీ చాలాసార్లు ఇది అక్రమంగా కూడా జరుగుతుండటమే భయంకరమైన విషయం.
ఫోన్ ట్యాప్ అయినా గుర్తించేది ఎలా?
మీ ఫోన్ ట్యాప్ అయిందా అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఉదాహరణకు, మీ ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా త్వరగా ఖర్చవుతుండటం, సాధారణం కంటే ఎక్కువ డేటా వినియోగం జరగటం, కాల్ చేస్తున్నప్పుడు లేదా స్వీకరిస్తున్నప్పుడు బ్యాగ్రౌండ్‌లో వింత శబ్దాలు వినిపించటం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. మీరు డౌన్లోడ్ చేయనిది కానీ ఫోన్‌లో ఉన్న కొత్త యాప్స్‌ను గమనిస్తే అవి స్పైవేర్ అయ్యే అవకాశం ఉంది.
ఫోన్ ట్రాకింగ్ సంకేతాలు
మీ ఫోన్ ఆటోమేటిక్గా లొకేషన్ ఆన్ అవుతూ ఉంటే, అది కూడా ట్యాపింగ్‌కు సంకేతమే కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో, ఫోన్ వేగంగా హీటవడం, సిగ్నల్ లేకపోయినా డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతున్నట్లు కనిపించడం వంటివి కూడా శంకకు కారణం కావచ్చు. ఈ రకమైన సమస్యలు మీ ఫోన్‌కి ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యిందని సూచించవచ్చు.
ఎలా జాగ్రత్త పడాలి?
ఈ రకమైన సైబర్ ముప్పుల నుంచి రక్షణ పొందేందుకు మీ ఫోన్‌కు తగిన సెక్యూరిటీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. రెగ్యులర్‌గా ఫోన్ సిస్టమ్ అప్డేట్ చేయడం, అనవసర యాప్స్‌ను డిలీట్ చేయడం, డేటా వాడకాన్ని ట్రాక్ చేయడం అవసరం. ఏదైనా అనుమానాస్పద యాప్ లేదా అవుట్‌పుట్ గమనిస్తే వెంటనే టెక్నికల్ నిపుణుల సలహా తీసుకోవాలి. ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం కూడా ఒక పరిష్కారంగా ఉపయోగపడుతుంది.