World’s Largest Floating Solar Plant: నీటిపై తేలియాడే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్.. మధ్యప్రదేశ్ లో ఏర్పాటు!!

నీటిపై తేలియాడే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లోని నర్మదా నదిపై నిర్మించనున్నారు.

  • Written By:
  • Publish Date - August 6, 2022 / 08:30 AM IST

నీటిపై తేలియాడే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లోని నర్మదా నదిపై నిర్మించనున్నారు. ఓంకారేశ్వర్ డ్యామ్ బ్యాక్ వాటర్ పై ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 600 మెగావాట్లు. 2027 సంవత్సరం నాటికి ఈ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే.. 12 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సయిడ్ ఉద్గారాల విడుదలకు అడ్డుకట్ట పడుతుంది. ఇది 1.52 కోట్ల మొక్కలు నాటడానికి సమానం. ఈ ప్లాంట్ మొదటి విడత నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై ఆగస్టు 4న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ సంతకం చేశారు.

60 నుంచి 70 శాతం నీళ్లు పొదుపు

నీటిపై తేలియాడే ఈ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ఓంకారేశ్వర్ డ్యామ్ బ్యాక్ వాటర్ పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల 60 నుంచి 70 శాతం నీళ్లు ఆవిరి కాకుండా పొదుపు అవుతాయి. ఇలా పొదుపు అయ్యే నీళ్లు భోపాల్ నగరవాసుల అవసరాలను తీర్చేందుకు దాదాపు 124 రోజులు పనికి వస్తాయి. ఈ ప్లాంట్ వల్ల ఓంకారేశ్వర్ డ్యామ్ బ్యాక్ వాటర్ లో ఆల్గే పెరుగుదలకు అవకాశాలు ఉండవు.

నీటిపై ఎలా తేలుతుంది ?

సాధారణంగా ఏదైనా ఒక వస్తువు నీటి పై తెలియడాలంటే ఆ వస్తువు ద్రవ్యరాశి, నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండాలి. ఇది అందరికి తెలిసిన విషయమే. సౌరఫలకాలు కూడా బరువు తక్కువగానే ఉంటాయి. ఇక్కడ సమస్యల్లా వాటిని ఫ్రేమ్‌లో అమర్చి.. ఒకదానికొకటి అనుసంధానం చేయడం. ఇలా చేస్తే ఎక్కడో ఒక దగ్గర బరువు పెరిగినా ఫలకాలు నీటిలో మునిగిపోతాయి. అటువంటప్పుడు సూర్యకాంతి ప్రసరించక విద్యుత్ ఉత్పత్తి జరగదు. మరి ఈ సమస్యలన్నిటినీ ఎలా అధిగమించారు?. ఓడరేవులు, మెరైన్ తీరాల్లో నీటిపై తెలియాడేలా ఓడల డాకింగ్ కోసం వాడే “డ్రై డాక్” పద్దతిని అనుసరించి స్ట్రింగ్లను ఏర్పాటు చేశారు. ఆ స్ట్రింగ్లకు హెచ్‌డీపీఈ (హై డెన్సిటీ పాలిథిలిన్)తో తయారు చేసిన ఫ్లోటర్లను (తేలియాడే) ఏర్పాటు చేసి సౌర ఫలకాలు బిగించారు. క్రిస్టలిక్ సిలికాన్ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫొటో వోల్టాయిక్ ప్యానళ్లను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించారు. సౌర ఫలకాలతోపాటు ఇన్వర్టర్ గదులు, ట్రాన్స్ఫార్మర్లు,హెచీ బ్రేకర్లు నీటిపై తేలియాడేలా ఈ ప్లాంట్ ను నిర్మిస్తారు.