WhatsApp Vs Pegasus : ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూప్’ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ చాలా ఫేమస్. ఈ స్పైవేర్‌ను ఫోన్లలోకి ప్రవేశపెట్టి వాటి మొత్తం యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. నెటిజన్ల ప్రైవసీకి భంగం కలిగించే డేంజరస్ స్పైవేర్‌లను ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూప్’ తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీపై న్యాయపోరాటంలో వాట్సాప్‌కు భారీ విజయం లభించింది. వాట్సాప్‌లో ఉన్న ఒక బగ్‌ను ఆసరాగా చేసుకొని ఇజ్రాయెలీ కంపెనీ ‘ఎన్‌ఎస్ఓ గ్రూప్’ తమ యూజర్లపై నిఘా పెట్టిందని వాట్సాప్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ ఆరోపించింది. ఈవిషయమై ఐదేళ్ల క్రితం కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కోర్టులో దావా వేసింది. దీన్ని విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.
Also Read :Fact Check : పార్లమెంటులోని అన్ని సీట్లపై అంబేద్కర్ ఫొటోలు.. నిజమేనా ?
వాట్సాప్ యూజర్ల సమాచారం హ్యాక్ కావడానికి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌నకు(WhatsApp Vs Pegasus) చెందిన స్పైవేర్ కారణమని గుర్తించామని కోర్టు వెల్లడించింది. వాట్సాప్‌లోని ఒక బగ్ సాయంతో ఆ యాప్‌లోకి పెగాసస్ స్పైవేర్‌ను ఇజ్రాయెలీ కంపెనీ ఎన్‌ఎస్ఓ గ్రూప్ చొప్పించిందని తమకు ఆధారాలు లభించాయని న్యాయస్థానం తెలిపింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా వాట్సాప్ యూజర్ల యాక్టివిటీస్‌పై ఎన్ఎస్‌ఓ గ్రూప్ అనధికారికంగా నిఘా పెట్టిందని కోర్టు వెల్లడించింది. హ్యాకింగ్, కాంట్రాక్ట్ ఒప్పందం ఉల్లంఘనకు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌దే బాధ్యత అని న్యాయస్థానం గుర్తించింది. ఈ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఎన్‌ఎస్ఓ గ్రూపుపై ఎంత జరిమానా వేయాలి అనే దానిపై తదుపరిగా ఓక్లాండ్ కోర్టులో వాదనలు జరుగుతాయని తెలుస్తోంది. అయితే ఈ తీర్పుపై ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ ఇంకా స్పందించలేదు.
Also Read :Arvind Kejriwal Vs ED : లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ విచారణ.. ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి
అపర కుబేరుడు మార్క్ జుకర్‌బర్గ్ సారథ్యంలో మెటా గ్రూప్ పనిచేస్తోంది. దీని పరిధిలోనే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నాయి. వాట్సాప్ హెడ్ విల్ క్యాథ్‌కార్ట్ ఈ అంశంపై స్పందిస్తూ.. ‘‘మా యూజర్ల గోప్యతా హక్కులకు దక్కిన విజయం ఇది’’ అని ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు అక్రమంగా వాట్సాప్ సర్వర్ల యాక్సెస్‌ను పొంది.. ఆ మార్గం ద్వారా జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు సహా దాదాపు 1400 మంది మొబైల్ ఫోన్లలోకి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను పంపింది. ఈలిస్టులో భారతదేశానికి చెందిన రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జీలు కూడా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ అంశంపై తాము 2019లో కోర్టులో కేసు వేశామని విల్ క్యాథ్‌కార్ట్ చెప్పారు. తమకు ఎన్ఎస్‌ఓ గ్రూపు నుంచి నష్టపరిహారం రావాల్సి ఉందన్నారు. కాగా, పెగాసస్ స్పైవేర్‌ను ఉగ్రవాదం, నేరాల కట్టడి కోసం విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ అనుమతులను పొందింది.