ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అలాగే గతంలో తీసుకువచ్చిన ఫీచర్స్ లో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి అది ఎలా పని చేస్తుంది అన్న వివరాల్లోకి వెళితే..
వాట్సాప్ త్వరలో తన ప్లాట్‌ఫామ్ లో బిల్ పేమెంట్ ఫీచర్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక వెల్లడించింది. ఈ ఫీచర్ ను కేవలం భారతీయ వినియోగదారుల కోసం ఉద్దేశించి రూపొందించినట్లు తెలుస్తోందీ. ముఖ్యంగా తమ యూజర్లకు వాట్సాప్ మరింత రిచ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఫీచర్ ను రూపొందించారని తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా ఇకపై ప్రజలు తమ యుటిలిటీ బిల్లులను చెల్లించే సదుపాయం ఉంటుంది. భారతదేశం లోని 500 మిలియన్ లకు పైగా వాట్సాప్ యూజర్లకు ఇది చాలా పెద్ద అప్‌డేట్ అని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్ల లేటెస్ట్ బీటా వెర్షన్ లో టెస్టింగ్ దశలో ఉంది.
వాట్సాప్ బిల్ పేమెంట్ ఫీచర్ ద్వారా యూజర్లు విద్యుత్ బిల్లులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, ఎల్‌పీజీ గ్యాస్ చెల్లింపులు, వాటర్ బిల్స్, అద్దె చెల్లింపులు, ల్యాండ్ లైన్ బిల్లులు వంటి చెల్లింపులను వాట్సాప్ యాప్ ద్వారానే చేసే సౌలభ్యం ఉంటుంది. ముఖ్యంగా సాధారణ స్థాయి వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ బిల్ పేమెంట్ ఫీచర్ రూపొందించారట. వినియోగదారుల కోసం వాట్సాప్ లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే సమయానికి బిల్లు పేమెంట్స్ మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వాట్సాప్ భారతదేశం లోని తన వినియోగదారులను యూపీఐ ద్వారా కాంటాక్ట్ లకు డబ్బు పంపడానికి, వ్యాపారాలకు చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది.