Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై గ్రూపులో ముఖ్యమైన టాపిక్స్ మిస అవ్వలేరు?

Mixcollage 13 Dec 2023 06 01 Pm 7296

Mixcollage 13 Dec 2023 06 01 Pm 7296

ఈ మధ్య కాలంలో వాట్సాప్ సంస్థ వరుస ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. నెలలో కనీసం నాలుగు ఐదు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది వాట్సాప్ సంస్థ. ఇప్పటికే సెట్టింగ్స్, ప్రైవసీ, చాటింగ్, గ్రూప్స్, వీడియో కాల్స్ లాంటి ఎన్నో విషయాలలో అనేక రకాల ఫీచర్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. మామూలుగా వాట్సాప్ గ్రూప్స్ లో కొన్ని కొన్ని సార్లు వందల మెసేజ్లు దర్శనమిస్తూ ఉంటాయి.

అయితే ఏ విషయంపై అందరూ చాట్ చేస్తున్నారు అన్నది తెలియక నెమ్మదిగా పైకి ఒక మెసేజ్ చదువుతూ స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటాం. అలా కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్‌ను కూడా మిస్‌ అయిపోతూ ఉంటాం. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ వాట్సప్‌ కొత్తగా పిన్‌ చాట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వ్యక్తిగత చాట్‌లు, గ్రూపుల్లో జరిగే సంభాషణలను వ్యక్తులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు వాట్సప్‌ తీసుకొచ్చిన పిన్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. గ్రూప్‌లోని సభ్యులు ముఖ్యమైన సమాచారాన్ని మిస్‌ అవ్వకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ను గ్రూప్‌ అడ్మిన్లు వినియోగించవచ్చు. కేవలం టెక్ట్స్‌ మెసేజ్‌ లే కాకుండా, వాట్సప్‌ పోల్స్‌, ఫొటోలు, ఎమోజీలు ఇలా అన్నింటినీ పిన్‌ చేయవచ్చు.

ఇలా పిన్‌ చేసిన మెసేజ్‌ వాట్సప్‌ చాట్‌లోని పై భాగంలో కనిపిస్తుంది. ఇలా పిన్‌ చేసినవి డిఫాల్ట్‌గా 7 రోజులు ఉంటాయి. కావాలనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్‌ చేసుకోవచ్చు. టైమ్‌ లిమిట్ అయిపోగానే పిన్‌ చేసిన మెసేజ్‌ అన్‌పిన్ అవుతుంది. గ్రూప్‌లోని సభ్యులకు పిన్‌ చేసే నియంత్రణ అందించడం అడ్మిన్‌ చేతిలోనే ఉంటుంది. ఏదైనా చాట్‌లోని మెసేజ్‌ని లాంగ్‌ ప్రెస్ చేసి మోర్ ఆప్షన్స్ పై క్లిక్‌ చేయగానే అందులో పిన్ అనే కొత్త ఫీచర్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే మీ మెసేజ్‌ పిన్‌ అవుతుంది. అదే తరహాలో అన్‌పిన్‌ కూడా చేయవచ్చు. ఈ ఫీచర్‌ను మొబైల్‌, డెస్క్‌టాప్‌ యూజర్లకు వాట్సప్‌ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి రాగా త్వరలో మిగిలిన వారికీ కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.