Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

వాట్సాప్ గ్రూప్ లకు సంబంధించిన కొత్త కొత్త ఫీచర్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 07:00 PM IST

వాట్సాప్ గ్రూప్ లకు సంబంధించిన కొత్త కొత్త ఫీచర్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేసి.. 256 నుంచి 512కు పెంచిన వాట్సాప్ కంపెనీ మరిన్ని ఫీచర్స్ ను కూడా తీసుకురానుంది. వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు సైలెంట్ గా ఎగ్జిట్ అయ్యేందుకు దోహదం చేసే ఒక ఫీచర్ ప్రస్తుతం డెస్క్ టాప్ వర్షన్ లో టెస్టింగ్ దశలో ఉంది. తద్వారా సభ్యులు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిన సమాచారం కేవలం అడ్మిన్ లకే తెలుస్తుంది. వాట్సాప్ గ్రూప్ చాట్ హిస్టరీ లో ఆ వివరాలు అందరు సభ్యులకు కనిపించవు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధమైన మరో ఫీచర్ ను కూడా వాట్సాప్ పరీక్షిస్తోంది. అదేమిటంటే.. ‘ వ్యూ పాస్ట్ పార్టీసిపెంట్స్’ ఆప్షన్. దీన్ని ఆండ్రాయిడ్ బీటా వర్షన్ లో ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ లో భాగంగా వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులంతా.. గతంలో గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిన వారి సమాచారాన్ని కూడా చూడొచ్చు. అయితే గతంలో ఎగ్జిట్ అయిన సభ్యుల పేర్లు కనిపిస్తాయా ? ఫోన్ నంబర్లు కనిపిస్తాయా ? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వాట్సాప్ గ్రూప్ ల నుంచి సభ్యులు సైలెంట్ గా నిష్క్రమించే ఫీచర్ తొలుత అందుబాటులోకి రాబోతోంది. అదే జరిగితే.. గ్రూప్ సభ్యులకు ఎగ్జిట్ అవుతున్న సభ్యుల సమాచారం తెలియదు. ఒకవేళ దీన్ని తెలుసుకోవాలి అని భావించే వాట్సాప్ గ్రూప్ సభ్యులకు ‘వ్యూ పాస్ట్ పార్టీసిపెంట్స్’ ఆప్షన్ మరో మార్గంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం వాట్సాప్ గ్రూప్ లోని ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళాలి. ఇందులో అడుగు భాగంలో ‘వ్యూ పాస్ట్ పార్టీసిపెంట్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే .. గతంలో వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలగిన వారి చిట్టా కళ్లెదుట ప్రత్యక్షం అవుతుంది. అయితే .. పరస్పర వైరుధ్యం కలిగిన ఈ రెండు ఫీచర్లను ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనము ఏదీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, వాట్సాప్ గ్రూపు చాట్ లోని ఏ మెసేజ్ నైనా డిలీట్ చేసే ప్రత్యేక అధికారాన్ని అడ్మిన్ లకు కల్పించే మరో ఫీచర్ ను కూడా వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చింది.