ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం వీడియో కాల్స్ ఇలా ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ ఈసారి ఏకంగా మూడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి వాట్సాప్ సంస్థ తీసుకువచ్చిన ఆ సరికొత్త ఫీచర్ల విషయానికి వస్తే.. వినియోగదారులను అభిప్రాయాలను అడగడానికి, ఫీడ్‌బ్యాక్ సేకరించడానికి తీసుకొచ్చిన పోలింగ్ ఫీచర్ కి మరో కొత్త ఫీచర్లు యాడ్ చేసి అప్‌డేట్ అందించింది. అదే విధంగా మెసేజ్‌లు, డాక్యుమెంట్లను క్యాప్షన్ తో ఫార్వాడ్ చేసే సదుపాయం తీసుకొచ్చింది.
వాట్సాప్ సంస్థ 2022 నవంబర్ లోనే పోలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకీ తీసుకువచ్చింది. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్‌కి లేటెస్ట్ అప్‌డేట్‌లను తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. ఏదైనా అంశంపై ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. కొత్తగా ఇందులో మూడు అప్ డేట్ లను తీసుకొచ్చింది. క్రియేట్ సింగిల్ ఓట్ పోల్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ చాట్స్, పోల్ రిజల్ట్ అప్ డేట్. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వాట్సాప్ పోల్స్ లో యూజర్లు ఒకటి కన్నా ఎక్కువసార్లు తమకు నచ్చిన ఆప్షన్‌కు ఓటు వేయవచ్చు. దాంతో ఆ పోల్స్ ఫలితాల్లో సరైన పారదర్శకత ఉండటం లేదని చాలా మంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారంగానే వాట్సాప్ క్రియేట్ సింగిల్ ఓట్ పోల్ ఆప్షన్ తీసుకొచ్చింది. దీంతో పోల్ లో పాల్గొనే వారు ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరు.
అలాగే ఏదైనా గ్రూప్ లో పోల్ నిర్వహించినప్పుడు తర్వాత ఓటు వేద్దామని మర్చిపోతుంటారు. తర్వాత గ్రూప్ లో వచ్చిన మెసేజ్‌లతో పోల్ ఎక్కడ ఉందనేది కనిపించదు. అటువంటి సందర్భంలో పోల్‌ను సులువుగా గుర్తించేందుకు చాట్ పేజీలో సెర్చ్ చేయచ్చు. ఫైల్స్ షేరింగ్‌కి కొత్త ఆప్షన్స్.. యూజర్లు ఈజీగా ఇన్‌ఫర్మేషన్ షేర్ చేయడానికి, కమ్యూనికేట్ కావడానికి వీలుగా వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను క్యాప్షన్‌లతో ఫార్వార్డ్ చేయవచ్చు. ఫొటో విత్ క్యాప్షన్.. గతంలో ఇతరులు పంపిన లేదా గ్రూప్ లో వచ్చిన ఫొటోలను మరొకరితో షేర్ చేసేటప్పుడు ఇమేజ్ మాత్రమే ఫార్వార్డ్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇమేజ్ తో పాటు టెక్ట్స్‌ను వేరేగా కాపీ చేసి పేస్ట్ చేయాల్సిందే.
కానీ ఫార్వాడింగ్ విత్ క్యాప్షన్స్ ఫీచర్‌తో ఇతరులు పంపిన ఫొటోతో పాటు దాని కింద ఉన్న క్యాప్షన్ కూడా ఫార్వార్డ్ అవుతుంది. డాక్యుమెంట్ విత్ క్యాప్షన్.. షేరింగ్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్స్‌తో యూజర్లు ఏదైనా డాక్యుమెంట్ ను ఇతరులుకు షేర్ చేసేటప్పుడు దాని గురించిన సమాచారం క్లుప్తంగా పంపవచ్చు. అంటే ఫొటో విత్ క్యాప్షన్ తరహాలోనే యూజర్ అటాచ్ ఫైల్ ఆప్షన్ ద్వారా ఏదైనా డాక్యుమెంట్ పంపుతుంటే అందులోని సమాచారం గురించి వివరిస్తూ టెక్ట్స్ యాడ్ చేయవచ్చు.