Buying New Phone: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? తొందరపడితే నష్టపోవాలసిందే..

స్మార్ట్‌ ఫోన్‌ సగటు విక్రయ ధర రికార్డు స్థాయిలో రూ. 18,479/- కి చేరుకుంది.

2022 సంవత్సరంలో మన దేశంలో 20.1 మిలియన్ స్మార్ట్‌ఫోన్లు (Phone) సరఫరా అయ్యాయి. చూడడానికి ఇది చాలా పెద్ద నంబర్‌గా కనిపిస్తున్నా, వాస్తవానికి గత సంవత్సరం ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తగ్గింది. అంతకుముందు సంవత్సరం 2021 తో పోలిస్తే, షిప్‌మెంట్లలో 12% క్షీణత కనిపించింది. వీటిలో.. ఫీచర్‌ ఫోన్ల వాటా 5.7 కోట్లు. వీటి సరఫరాలు కూడా 18% తగ్గాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం దీనికి ప్రధాన కారణం.

2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలోనూ (అక్టోబర్‌ – డిసెంబర్‌ కాలం) స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు తగ్గాయి, 2021 లోని ఇదే కాలంతో పోలిస్తే 27% పైగా క్షీణించి 2.96 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా, దీపావళి తర్వాత కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. ధరల్లో డిస్కౌంట్లు, కొన్ని రకాల తగ్గింపు పథకాలను కంపెనీలు ఆఫర్‌ చేసినా ఇన్వెంటరీ మాత్రం క్లియర్ కాలేదు.

స్మార్ట్‌ ఫోన్‌ (Phone) సగటు విక్రయ ధర రికార్డు స్థాయిలో రూ. 18,479కి చేరుకుంది. 2021 తో పోలిస్తే సగటు ధర 2022లో 18% పెరిగింది. అయితే.. ఎంట్రీ లెవల్ విభాగం నుంచి వచ్చిన వాటా మాత్రం 2022లో 46%కు క్షీణించింది, 2021 లో ఇది 54%గా ఉంది.

తగ్గిన సామాన్యుడి ఫోన్ (Phone) సరఫరాలు

IDC రిపోర్ట్‌ ప్రకారం… రూ. 25,000 – రూ. 41,000 శ్రేణిలోని మీడియం రేంజ్‌, ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ల సరఫరాలు 20% పెరిగాయి. రూ. 41,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు కూడా 55% పెరిగాయి. ఎంట్రీ లెవెల్‌ స్థాయి ఫోన్లు, అంటే రూ. 12,500 లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లు సరఫరాలు 54 శాతం నుంచి 46 శాతానికి దిగి వచ్చాయి. రూ. 25,000 ధర లోపు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ సరఫరాలు 15% తగ్గాయి. అంటే, కాస్త డబ్బున్న వాళ్లు, సంపన్నులు కొనే స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు పెరిగితే, సామాన్యులు కొనే ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ విక్రయాలు బాగా తగ్గాయి. ఫైనల్‌గా.. ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల్నే టార్గెట్‌ చేస్తుంది గానీ, సంపన్నులను కాదని అర్ధం అవుతోంది.

స్మార్ట్‌ ఫోన్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల రేట్లు పెరుగుతున్న కారణంగా ఇప్పటికే ఫోన్ల ధరలు పెరిగాయి, సామాన్యులకు దూరం అవుతున్నాయి. దీనికి తోడు, అమ్ముడుపోకుండా పేరుకు పోయిన నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. ఈ కారణంగా 2023 ప్రథమార్ధం వరకు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలకు ఇబ్బందులు పడవచ్చు.

మార్కెట్‌ లీడర్‌ షియోమీ

ఇక, మార్కెట్‌ వాటాలను చూస్తే.. డిసెంబర్‌ త్రైమాసికంలో 18.6% మార్కెట్ వాటాతో షియోమీ అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. శామ్‌సంగ్ 18.4% వాటాతో రెండో స్థానంలో ఉంది, వివో 17.6% వాటాతో థర్డ్‌ ప్లేస్‌లో ఉంది.

మొత్తం 2022 సంవత్సరాన్ని లెక్కలోకి తీసుకుంటే… Xiaomi 21% షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. 18.1% షేర్‌తో Samsung రెండో స్థానంలో, 15.9% షేర్‌తో Vivo తర్వాతి స్థానంలో నిలిచాయి. 2022లో ఆన్‌లైన్ ఛానెళ్ల షిప్‌మెంట్లు 6% క్షీణించినా, మొత్తం షిప్‌మెంట్స్‌లో 53% వాటాతో ఇప్పటికీ మేజర్‌ ఛానెల్‌గా ఆన్‌లైన్‌ నిలిచింది. ఇదే సమయంలో, ఆఫ్‌లైన్ ఛానెల్ ఏడాదికి 15% క్షీణించింది.

5G హ్యాండ్‌సెట్‌ల సగటు విక్రయ ధరలు 2021లోని రూ. 35,555 నుంచి 2022లో రూ. 32,585 కు తగ్గిందని నివేదిక పేర్కొంది. 2023లో, భరించగలిగే ధరలకే 5G లాంచ్‌లు జరగడంతో, ఈ సంవత్సరంలో షిప్‌మెంట్లలో 5G హ్యాండ్‌సెట్లు వాటా 60% ఉండొచ్చని IDC రిపోర్ట్ అంచనా వేసింది.

Also Read:  Aamir Khan vs Kangana: అమీర్ ఖాన్ పై కంగన ట్రోల్స్‌