Solar Power: రాత్రి వేళ కూడా సౌర విద్యుత్ ఉత్పత్తి.. విప్లవాత్మక సాంకేతికత ఆవిష్కరణ

సౌర శక్తి అనంతమైనది. ఉచితమైనది. అయితే ..దానికి ఒక పరిమితి ఉంది

  • Written By:
  • Publish Date - May 20, 2022 / 05:30 AM IST

సౌర శక్తి అనంతమైనది. ఉచితమైనది. అయితే ..దానికి ఒక పరిమితి ఉంది. రాత్రివేళ సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయలేం. ఈ పరిమితిని కూడా అధిగమించే సాంకేతికతను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం “ధర్మో రేడియేటివ్ డయోడ్” అనే సెమీ కండక్టర్ పరికరాన్ని తయారు చేశారు.

పగలంతా సూర్యుడి ఎండ వల్ల
సోలార్ ప్యానళ్ల లో ఉష్ణం నిక్షిప్తం అవుతుంది. ఈ ఉష్ణాన్ని రాత్రివేళ పరారుణ కిరణాలుగా మార్చేసి.. “ధర్మో రేడియేటివ్ డయోడ్” సౌర విద్యుత్ రూపాన్ని ఇస్తుంది. సోలార్ బ్యాటరీల ద్వారా పనిచేసే చాలా పరికరాల్లోనూ ఈ టెక్నాలజీని పరిశోధకులు ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. సోలార్ బ్యాటరీలు లేకుండా ఆయా పరికరాలు పనిచేసే దిశగా ఈ పరిశోధనలను తొలి అడుగుగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. “ధర్మో రేడియేటివ్ డయోడ్” తయారీకి నైట్ విజన్ గాగుల్స్ కు సంబంధించిన మెటీరియల్ ను వినియోగించారు.

రాత్రి వేళ సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం..ఈ మెటీరియల్ తో సోలార్ బ్యాటరీలు తయారీ జరిగితే భవిష్యత్ ముఖ చిత్రం మారే అవకాశాలు ఉన్నాయి. అయితే “ధర్మో రేడియేటివ్ డయోడ్” సాంకేతికత ద్వారా రాత్రివేళ సోలార్ ప్యానళ్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్.. ఉదయం వేళ సోలార్ ప్యానల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ కంటే 1 లక్ష వంతులు తక్కువ . భవిష్యత్ లో ఈ సాంకేతికతను మరింత తీర్చిదిద్దితే రాత్రివేళ కూడా పెద్దమొత్తంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “ఏసీఎస్ ఫోటోనిక్స్” జర్నల్ లో ప్రచురితమైంది.