Site icon HashtagU Telugu

Telegram : టెలిగ్రాం యూజర్లకు అలర్ట్.. పావెల్ దురోవ్ సంచలన ప్రకటన

Telegram Pavel Durov

Telegram : టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా టెలిగ్రాం యూజర్లపై సెర్చ్ వారెంట్లు జారీ అయినా, వారిపై లీగల్ ఆర్డర్లు జారీ అయినా తాము ప్రభుత్వ సంస్థలకు సహకరిస్తామని వెల్లడించారు. ఈక్రమంలో ఆయా యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రస్‌లను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. టెలిగ్రాం ప్రైవసీ పాలసీ అనేది క్రిమినల్స్‌కు అస్సలు సహకరించదని ఆయన తేల్చి చెప్పారు.  వాస్తవానికి టెలిగ్రాంలోని 99.99 శాతం మంది యూజర్లు నేరపూరిత చర్యలు చేసే అవకాశమే లేదన్నారు.  కేవలం 0.001 శాతం మంది మాత్రమే టెలిగ్రాంను దుర్వినియోగం చేస్తున్నారని పావెల్ దురోవ్ (Telegram) తెలిపారు. అలాంటి వాళ్ల వల్లే 100 కోట్ల మంది టెలిగ్రాం యూజర్ల ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవలే ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడి పోలీసులు టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్‌ను అరెస్టు చేసి విచారించారు.  టెలిగ్రాంను కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్న తీరుపై ఆయనను ప్రశ్నించారు. ఈనేపథ్యంలో ఇప్పుడు ఈవిధమైన ప్రకటనను ఆయన వెలువరించడం గమనార్హం.

డ్రగ్స్ రవాణా, పిల్లలకు సంబంధించిన పోర్న్ ఫొటోలు వంటివి టెలిగ్రాంలో బాగా పోస్ట్ అవుతున్నాయనే వాదన తెరపైకి వచ్చింది. ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను కంట్రోల్ చేసే చర్యలను టెలిగ్రాం తీసుకోలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఇప్పుడు పావెల్ దురోవ్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. టెలిగ్రాంలో బాధ్యతాయుత కంటెంట్ ఉండేలా చూస్తామని ఆయన అంటున్నారు. పావెల్ దురోవ్ రష్యా జాతీయుడు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్దం నడుస్తోంది. ఈ తరుణంలో ఇటీవలే ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రభుత్వ పరికరాల్లో టెలిగ్రాంను వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఫ్రాన్స్ కూడా టెలిగ్రాం యాప్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది.