Site icon HashtagU Telugu

Private Rocket Launch: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ స్టార్టప్.. ప్రయోగం విజయవంతం..!

Rocket

Rocket

ఒకప్పుడు కేవలం 10 మంది సభ్యులతో చిన్న స్టార్టప్. ఇప్పుడు దేశంలో మొదటి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమలో కొత్త అధ్యాయానికి తెరతీసింది. 2018లో 10 మంది బృందంతో కొండాపూర్‌లోని చిన్న సెటప్ నుండి ప్రారంభించబడిన స్కైరూట్.. నేటి సాంకేతికత సరిహద్దులను ముందుకు తీసుకురావడం ద్వారా అందరీ దృష్టిని ఆకర్షించింది. ఈ స్టార్టప్.. స్పేస్ జీవితంలో భాగమయ్యే భవిష్యత్తు కోసం స్కైరూట్ పని చేస్తోంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు హైదరాబాద్‌కు చెందిన టి-హబ్ ఇంక్యుబేటెడ్ స్పేస్‌ టెక్ కంపెనీ ‘స్కైరూట్’ కోఫౌండర్లు పవన్ చందన, నాగ భరత్ డాకాలకు అభినందనలు వెలువెత్తుతున్నాయి.

“భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా మేము చరిత్రను సృష్టించాము. ఇది భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థలో కొత్త శకానికి నాంది. టీమ్ స్కైరూట్ ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన పర్యావరణ వ్యవస్థ మూలమైన విక్రమ్ సారాభాయ్‌కి అంకితం చేసింది. ఈ అడుగు భారతీయ స్టార్టప్‌లకు పెద్ద ముందడుగు” అని హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన అన్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 11:30 గంటలకు స్కైరూట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ను విజయవంతంగా ప్రయోగించింది. స్కైరూట్ తెలంగాణలో ఉన్న అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటెడ్ కంపెనీ. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిన రాకెట్ 89.5 కిలోమీటర్ల పైకి వెళ్లింది. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది.

నవంబర్ 17న ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACE), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (DOS) నుంచి మూడు ఉపగ్రహాలను మోసుకెళ్లే ఈ రాకెట్ ప్రయోగానికి అనుమతి లభించింది. స్కైరూట్ మూడు విభిన్న విక్రమ్ రాకెట్ వెర్షన్‌లలో పనిచేస్తోంది. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది.