V2X Tech: వీ2ఎక్స్ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కారే కంప్యూటర్ గా..!

రోడ్డు మీద బండి నడపాలంటే భయం. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 12:27 PM IST

రోడ్డు మీద బండి నడపాలంటే భయం. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణం పోతుంది. అలా మన దేశంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలు దాదాపు 4,50,000. ఈ ప్రమాదాల వల్ల చనిపోతున్నవారు దాదాపు 1,50,000. ఇది ప్రపంచ బ్యాంకు నివేదిక చెప్పిన నిజం. ప్రపంచంలో ఉన్న వాహనాల్లో మన దగ్గరున్నవి కేవలం ఒక శాతం. కానీ ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో 11 శాతం మంది మన దేశంవారే. అందుకే రోడ్డు ప్రమాదాలకు పూర్తిగా చెక్ పెట్టేలా వీ2ఎక్స్ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది.

వాహనాలు వేగంగా వెళ్తున్నప్పుడు కాని, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నప్పుడు కాని రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటివాటిని వెహికల్ టూ ఎవ్రీథింగ్ -వీ2ఎక్స్ టెక్నాలజీ పూర్తిగా అడ్డుకుంటుంది. హైదరాబాద్ ఐఐటీ, సుజుకి మోటార్ కార్పొరేషన్, మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థలు తొలిసారిగా ఈ టెక్నాలజీని
తయారుచేశాయి. హైదరాబాద్‌ ఐఐటీ లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా చూపించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సాంకేతికతపై ఆసక్తిని చూపించింది. అందుకే రాష్ట్రంలో రోడ్లపై ఈ టెక్నాలజీని పరీక్షించి.. ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయో చెప్పాలని కోరింది.

ఈ వీ2ఎక్స్ టెక్నాలజీ.. రోడ్డుపై ప్రయాణించే అన్ని రకాల వెహికల్స్ తోపాటు పాదచారులతోనూ లింక్ అయి ఉంటుంది. అందుకే చుటుపక్కల ఉన్న వాహనాలు, అవి ఎంత వేగంతో వస్తున్నాయి.. ఏవి దగ్గరగా వస్తున్నాయి అన్నది గమనిస్తుంది. ఆమేరకు డ్రైవర్ ను ముందే అప్రమత్తం చేస్తుంది. అంబులెన్స్ ఎన్ని నిమిషాల్లో తన వాహనాన్ని సమీపిస్తుందో, ఎటువైపు దారి ఇవ్వాలో కూడా ఇది ముందే వాహనదారుడిని హెచ్చరిస్తుంది. రోడ్డుదాటేవారిని ముందే గుర్తిస్తుంది. సందులు, మలుపుల్లో అకస్మాత్తుగా వచ్చే బైకులు వంటి 2 వీలర్స్ ఎంత దూరంలో ఉన్నాయో.. ఏ డైరెక్షన్ లో వస్తున్నాయో కూడా చెబుతుంది.

రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలు చాలా దూరంలో ఉన్నప్పుడే ఈ వీ2ఎక్స్ టెక్నాలజీ గుర్తిస్తుంది. రోడ్లు బాగాలేని చోట ముందే అలెర్ట్ చేస్తుంది. కారును డ్రైవ్ చేయనప్పుడు.. అందులో ఉండే మైక్రో ప్రాసెసర్ ను కంప్యూటర్ గా ఈ టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకోవచ్చు.