Google Warning: గూగుల్ లో ఉన్నది ఎందరో.. పనిచేసేది కొందరే : సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు

  • Written By:
  • Updated On - August 6, 2022 / 01:51 PM IST

గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “గూగుల్‌లో ఎంతోమంది ఉద్యోగులున్న‌ప్ప‌టికీ.. వాళ్లలో కొద్దిమంది మాత్రమే సరిగ్గా పని చేస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. ” గూగుల్ ప్రోడ‌క్ట్స్ సామ‌ర్ధ్యం పెంచి, క‌స్ట‌మ‌ర్లకు సాయం అందించేలా ఉద్యోగులు మ‌రింత శ్ర‌ద్ధ‌గా, నైపుణ్యాల‌తో ప‌నిచేయాలి” అని సిబ్బందికి సుంద‌ర్ పిచాయ్ నిర్దేశించారు.
నైపుణ్యాల లేమి, సామ‌ర్ధ్యం మేర ప‌నిచేయ‌ని ఉద్యోగుల‌ను గూగుల్ తొల‌గించే ఛాన్స్ ఉందని పిచాయ్ వ్యాఖ్య‌ల‌తో తేట‌తెల్ల‌మ‌వుతోంది.
2022 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) గూగుల్ ఆదాయం, రాబ‌డి.. అంచనాల కంటే తగ్గొచ్చనే వార్త‌ల నేప‌ధ్యంలో గూగుల్ సీఈఓ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కూడా గూగుల్ రాబోయే క్వార్ట‌ర్ల‌లో ఉద్యోగులపై వేటు వేయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

రెండు వారాల పాటు నియామకాల నిలిపివేత

ఆర్దిక మాంద్య భ‌యాల‌తో హైరింగ్ ప్ర‌క్రియ‌ను కూడా నెమ్మ‌దించ‌ నున్న‌ట్టు గూగుల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. గూగుల్ రెండు వారాల పాటు నియామకాలను నిలిపివేయాలని భావిస్తోంది. అదే స‌మ‌యంలో హెడ్‌కౌంట్ అవ‌స‌రాలు, రాబోయే మూడు నెల‌ల్లో ఏయే విభాగాల్లో సిబ్బంది అవసరం ఉందో అంశాల‌ను మ‌దింపు చేస్తామ‌ని గూగుల్ పేర్కొంది.ఇప్ప‌టికే ఆఫ‌ర్లు అందుకున్న అభ్య‌ర్ధుల‌పై హైరింగ్ ప్ర‌క్రియ నిలిపివేత ప్ర‌భావం ఉండకపోవచ్చు. అలాగే కాంట్రాక్టు పొడిగింపును కోరే ఉద్యోగుల‌కు ఇబ్బందిక‌ర‌మేన‌ని చెబుతున్నారు.