Site icon HashtagU Telugu

Phone Charging Tips: ఈ తప్పులు చేస్తే మీ ఫోన్ బాంబులా పేలుతుంది.. బీ అలర్ట్!!

Phone Charging Imresizer

Phone Charging Imresizer

స్మార్ట్‌ఫోన్‌ యుగం ఇది. అందుకే అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అయితే ఫోన్‌ల వాడకం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిణామం సెల్ ఫోన్ వినియోగదారులను కలవర పెట్టేదే అని చెప్పొచ్చు. ఈనేపథ్యంలో ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? అనేది మనం తెలుసుకుంటే.. అలా జరగకుండా జాగ్రత్త పడగలుగుతాం.. ఇప్పుడు అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకుందాం..

ఎందుకు పేలుతున్నాయి?

ఫోన్‌లు పేలడానికి ప్రధాన కారణంగా అందులో ఉండే బ్యాటరీ. స్మార్ట్‌ ఫోన్లలోని లిథియం అయాన్ బ్యాటరీలతో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఈ రకం బ్యాటరీలనే వినియోగిస్తున్నాయి కంపెనీలు. లిథియంతో పాటు ధన అయాన్ క్యాథోడ్‌, రుణ అయాన్ ఆనోడ్ ఉంటాయి. ఈ రెండింటినీ వేరు చేస్తూ కర్బన ద్రవం ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ధన, రుణ అయాన్లు ఒకదానికొక‌టి తాకితే ర‌సాయ‌న చ‌ర్య జ‌రిగి పేలుడు సంభ‌విస్తుంది. అందుకే రెండింటినీ ఎలక్ట్రోలైట్లతో వేరు చేస్తారు.
బ్యాటరీని ఛార్జ్ చేసినప్పుడు అయాన్లు ఒకే దిశ‌లో ప్రవహిస్తుంటాయి. ఛార్జింగ్ ప్లగ్ తీసేయగానే అవి విద్యుత్‌ను రెండు వైపులా ప్రసారం చేస్తాయి. అయితే, క్యాథోడ్, ఆనోడ్‌ల మధ్య కర్బన ద్రవంలోంచి లిథియం కదులుతూ ఉంటుంది. క్విక్ ఛార్జింగ్ పద్ధతుల్లో బ్యాటరీని ఛార్జి చేసేటప్పుడు అధిక వేడి ఉత్పత్తి అయి ఆనోడ్‌పై లిథియం పేరుకుపోతుంది. దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వేగంగా చార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తే..

బ్యాటరీలను ఒక నిర్దిష్ట ఓల్టేజి విద్యుత్‌తో ఛార్జ్‌ చేసేలా తయారు చేస్తారు. అలాకాకుండా, క్విక్ చార్జర్లతో వేగంగా చార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తే కూడా ప్రమాదాలకు అవకాశం ఉంటుందంటున్నారు.

ఇతర కారణాలు…

కొందరు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టేసి అలా వదిలేస్తుంటారు. దానివల్ల 100 శాతం ఛార్జింగ్ పూర్తయిన తరువాత కూడా ఇంకా విద్యుత్ సరఫరా అవుతుంటుంది. అయాన్లలో విద్యుదావేశం పెరిగి వేడెక్కి మండిపోతుంది. స్మార్ట్ ఫోన్ కిందపడినప్పుడు ఒక్కోసారి అందులోని బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాటరీ లోపలి భాగాల్లో చీలికలు ఏర్పడినా, లేదంటే అమరికలో మార్పులు వచ్చినా షార్ట్ సర్క్యూట్‌ జరిగి మండిపోవడానికి కారణం కావచ్చు అని టెక్‌ నిపుణులు
అంటున్నారు .

నాణ్యత లేని బ్యాటరీలతో సమస్య..

అయితే మొబైల్‌లో నాణ్యత లేని బ్యాటరీలతో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. బ్యాటరీలో లోపలి భాగాల మధ్య కంటికి కనిపించని లోహ రేణువులు వంటివి ఉంటే అవి ఘటాల మధ్య ఘర్షణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండగా కాల్స్‌ మాట్లాడినా బ్యాటరీ పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. ఇవన్నీ కాకుండా కొన్ని సెల్‌ఫోన్‌ సెట్ల తయారీలోని లోపాల వలన కూడా పేలే అవకాశాలుంటాయి.

తస్మాత్ జాగ్రత్త..

* బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాటిని ఫోన్ నుంచి తొలగించాలి.
*కంపెనీకి చెందిన ఒరిజనల్‌ ఛార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి.
* ఛార్జింగ్‌లో ఉండగా కాల్స్‌ మాట్లాడటం, అలాగే గేమ్స్‌ ఆడటం చేయరాదు.
* ఛార్జింగ్ పూర్తయిన తరువాత ప్లగ్‌ నుంచి తొలగించాలి.
* పడుకునేటప్పుడు పక్కనే ఫోన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టొద్దు.
* ఛార్జింగ్ సమయంలో ఫోన్‌కి ఉండే తొడుగు (కేస్) తొలగించడం మంచిది.
*ఫోన్ బాగావేడిగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి.
* బ్యాటరీలో ఉండే ప్లస్, మైనస్‌లను ఒకదానికొకటి కలపరాదు.
*పని చేయని బ్యాటరీలను మంటల్లో వేయరాదు. వేస్తే పేలుడు సంభవిస్తుంది.
*బ్యాటరీలను రాళ్లతో గానీ, ఇనుపు వస్తువులతో గాని చితక్కొట్టరాదు.
* బ్యాటరీలను విప్పి వాటి లోపలి భాగాలను విడదీసే ప్రయత్నం చేయరాదు.
* బ్యాటరీలను మంటల వద్ద, గ్యాస్‌ స్టవ్‌ల వద్ద, వేడి హీటర్ల వద్ద ఉంచడం మంచిది కాదు.
*ఫోన్‌ నీళ్లలో పడిపోతే వెంటనే ఛార్జింగ్‌ పెట్టకుండా తేమ పూర్తిగా పోయాకే ఛార్జింగ్‌ పెట్టాలి.