Repairability Index : మనదేశంలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు వినియోగించే వారికి గుడ్ న్యూస్. త్వరలోనే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు రిపేరబిలిటీ ఇండెక్స్ రాబోతోంది. వాటిని తయారు చేసే కంపెనీలు ఇకపై తప్పనిసరిగా రేటింగ్ రూపంలో వాటి రిపేరబిలిటీ ఇండెక్స్‌ను డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఏసీలు, బల్బులు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లకు సంబంధించిన ఇంధన సామర్థ్యంపై రేటింగ్స్‌ను డిస్‌ప్లే చేస్తూ వచ్చారు. ఇకపై ఇదే ఫార్ములాను స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు వర్తింప జేయనున్నారు. తదుపరిగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర కీలక ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా రిపేరబిలిటీ ఇండెక్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.
Also Read :Vehicle Driving Test : డ్రైవింగ్ టెస్ట్ మరింత టఫ్.. ఇక ‘సిమ్యులేటర్’పైనా నెగ్గాల్సిందే
కేంద్రానికి చేరిన నివేదిక..
ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగదారుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల ఆధారంగానే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీంతో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను కొనే ముందు రిపేరబిలిటీ ఇండెక్స్(Repairability Index) ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఆయా వస్తువుల రిపేరబిలిటీ ఇండెక్స్‌ను ప్రతి కంపెనీ తన విక్రయ కేంద్రం, ప్యాకింగ్, వెబ్‌సైట్ల ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి భారత్ ఖేరా నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇప్పటికే కేంద్ర సర్కారుకు ఒక నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రిపేరబిలిటీ ఇండెక్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తుందని తెలుస్తోంది.
రేటింగ్ ఎలా కేటాయిస్తారు ?
ఎలక్ట్రానిక్ పరికరాల్లో డిస్‌ప్లే స్క్రీన్లు, బ్యాటరీలు, కెమెరా అసెంబ్లీలు, ఛార్జింగ్ పోర్టులు, స్పీకర్లు వంటి భాగాలు ఉంటాయి. వీటిని రిపేర్ చేయడానికి ఉన్న అవకాశం, అందుబాటులో ఉండే విడిభాగాలు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విధానాల ఆధారంగా రిపేరబిలిటీ ఇండెక్స్ రేటింగ్స్‌ను నిర్ణయిస్తారు. ఏదైనా ఒక సర్వీస్ సంతృప్తికరంగా ఉంటే 5 పాయింట్లు, మధ్యస్థంగా ఉంటే 3 పాయింట్లు ఇస్తారు. అమెరికా, ఐరోపా దేశాలు సహా అనేక అరబ్ దేశాలు ఇప్పటికే రిపేరబిలిటీ ఇండెక్స్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ లిస్టులో చేరబోతోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల నిర్వహణ, రిపేరింగ్ ప్రమాణాలను పెంచనుంది. దీనివల్ల వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. నమ్మకమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోలుకు మార్గం ఏర్పడనుంది.