ఇటీవల బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది మహిళల టాయిలెట్లో సీక్రెట్ కెమెరా (Secret camera) పెట్టిన ఘటనలో ఉద్యోగి నగేశ్‌ను అరెస్ట్ చేశారు. అతడు మహిళల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ సంఘటన సైబర్ భద్రత, మహిళల గోప్యతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి ముప్పుల నుంచి రక్షించుకోవడానికి మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Japan : అగ్నిపర్వతం బద్దలైంది, భూమి కంపించింది.. జపాన్‌లో రియో జోస్యం నిజమవుతుందా?
సీక్రెట్ కెమెరాలను సాధారణంగా కనిపించనివిధంగా వివిధ ప్రదేశాల్లో ఉంచే అవకాశముందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అద్దాల వెనుక, బాత్రూమ్ తలుపుల వద్ద, పైకప్పు మూలలు, సీలింగ్ లైట్లలో, బల్బులలో, టిష్యూ బాక్స్‌లలో, స్మోక్ డిటెక్టర్లలో ఇవి దాచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉండే కెమెరాలు కావడంతో వాటిని సులభంగా గుర్తించడం కష్టమే. అయితే కొన్ని చిన్న సూచనలు గుర్తుంచుకుంటే ముందస్తుగా అనుమానించవచ్చు.
మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, షాపింగ్ మాల్‌లు, హోటల్స్ లలో ఛేంజింగ్ రూమ్స్, లేదా లాడ్జింగ్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి వస్తువులను నిశితంగా పరిశీలించడం చాలా ముఖ్యం. గదిలో వెలుతురును ఆఫ్ చేసి ఫోన్ లైట్ లేదా లేజర్ లైట్ ద్వారా చిన్నగా మెరిసే ఎలక్ట్రానిక్ పాయింట్స్ కనిపిస్తాయేమో చూడాలి. అలాగే అద్దంలో మీ వేలు పెట్టి చూస్తే – మీ వేలుకు అద్దంలో ఉన్న ప్రతిబింబం మధ్య గ్యాప్ ఉంటే అది సాధారణ అద్దం, గ్యాప్ లేకపోతే Two-Way మిర్రర్ అనే అనుమానం పెట్టుకోవచ్చు.
ఇంకా మార్కెట్లో కెమెరా డిటెక్షన్ యాప్లు అందుబాటులో ఉన్నా, వాటిలో చాలావరకు వాస్తవానికి దూరంగా ఉండే మోసపూరితమైనవే అని నిపుణులు చెబుతున్నారు. దీంతో అతి విశ్వాసంతో ఆ యాప్స్‌ను నమ్మకూడదు. మహిళలు వ్యక్తిగత ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండటమే ఉత్తమ రక్షణ మార్గం. అనుమానాస్పద స్థితి ఉంటే హోటల్ సిబ్బందిని, పోలీసులను సంప్రదించడం మంచిది. సాంకేతిక ఆధునికతను నెగెటివ్‌గా ఉపయోగిస్తున్న ఈ ధోరణిని సమాజం గట్టిగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది.