Samsung Repair Mode: రిస్క్ నుంచి రక్షించే ‘రిపేర్’ మోడ్.. శామ్ సంగ్ ఫోన్లలో లేటెస్ట్ ఫీచర్

ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి ఫోన్ మొరాయిస్తే సెల్ ఫోన్ మెకానిక్ కు ఇస్తాం.

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 08:15 AM IST

మీరు శామ్ సంగ్ ఫోన్ వాడుతున్నారా ?

తమ వినియోగదారుల కోసం శామ్ సంగ్ సిద్ధం చేసిన ఒక ఫీచర్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి.

అది మీకెంతో ఉపయోగ పడుతుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటా అని ఆలోచిస్తున్నారా?

“రిపేర్ మోడ్” .. ఇది కొత్త ఫీచర్ పేరు.

ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి ఫోన్ మొరాయిస్తే సెల్ ఫోన్ మెకానిక్ కు ఇస్తాం. అక్కడ ఇచ్చిన తర్వాత మన ఫోన్ లోని ఫోటోలు, మెసేజ్ లు, డాక్యుమెంట్లు దుర్వినియోగం కానీ.. కాపీయింగ్ కానీ అయితే? జరగరాని నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అవి సోషల్ మీడియాలోకి, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్స్ లోకి వెళ్లిపోయే ముప్పు ఉంటుంది. ఇదంతా జరగకూడదంటే ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం ఫోన్ ను రీబూట్ చేయడం ఒక్కటే!! ఫోన్ ను రీబూట్ చేయడం వల్ల ఫోన్ లోని మొత్తం సమాచారం డిలీట్ అవుతుంది.

గూగుల్ డ్రైవ్ లో దాచుకున్న ఫైల్స్ మాత్రమే మిగులుతాయి. ఈ ఇబ్బందంతా ఉండకూడదని భావిస్తే శామ్ సంగ్ అభివృద్ధి చేసిన “రిపేర్ మోడ్” ఫీచర్ ను వాడుకోవాలి. దీనివల్ల ఫోన్ ను రిపేరింగ్ కు ఇచ్చే ముందు సింపుల్ గా “రిపేర్ మోడ్”ను ఆన్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఫోన్ స్క్రీన్ పై ఎలాంటి ఐకాన్స్ కనిపించవు. మీ సమాచారం దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉండదు.మళ్లీ మీరు మీ పాస్ వర్డ్ లేదా ఫింగర్ స్కానర్ ద్వారా “రిపేర్ మోడ్”ను ఆఫ్ చేస్తే.. దాగిపోయిన డేటా అంతా మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఫీచర్ చాలా బాగుంది కాదు!! అయితే తొలి విడతగా ఈ ఫీచర్ ను గెలాక్సీ ఎస్21 సిరీస్ ఫోన్లలో తీసుకొచ్చే యోచనలో శామ్ సంగ్ ఉంది. క్రమంగా ఇతర మోడళ్ల ఫోన్లకు సైతం ఈ ఫీచర్ ను విస్తరించనుంది.

ఆప్షన్ ఎంపిక ..

సెట్టింగ్స్ లో ‘బ్యాటరీ అండ్ డివైజ్ కేర్’ ఆప్షన్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ రిపేర్ మోడ్ కనిపిస్తుంది. దీన్ని సెలక్ట్ చేసుకుంటే ఫోన్ లో రిపేర్ మోడ్ ఆన్ అవుతుంది. దీంతో ఫోన్లోని ఫొటోలు, డేటా సాంకేతికంగా కనిపించకుండా పోతుంది.