కొరియన్ స్మార్ట్ ఫోన్ల తయారుదారు కంపెనీ శాంసంగ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. భారత్ లో తక్కువ ఖరీదు ఉండే ఫీచర్ ఫోన్ల మార్కెట్ నుంచి తపుకోనున్నట్లు వెల్లడించింది. రూ. 15వేలలోపు ఫోన్ల విక్రయాల నుంచి కూడా తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు బయటకు వస్తున్న లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఒకేసారి కాకుండా క్రమంగా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ కోసం ఫీచర్ ఫోన్లను డిక్సన్ టెక్నాలజీస్ తయారు చేసి ఇస్తుంటుంది. ఈఏడాది డిసెంబర్ తో చివరి బ్యాచ్ ఫోన్లను శాంసంగ్ కోసం తయారు చేయనుంది. ఆ తర్వాత నుంచి వాటి తయారీ ఉండదు.
అధిక ధరల ఫోన్లపైన్నే కంపెనీ ` దృష్టి సారించాలన్నది కంపెనీ ప్రణాళిక అని తెలుస్తోంది. వాస్తవానికి రూ.15వేల లోపు ఎక్కువ సంఖ్యలో ఫోన్లను శాంసంగ్ విక్రయిస్తుంటుంది. కానీ లాభాల మార్జిన్ తక్కువగా ఉంటుంది. ఖరీదైన ఫోన్లలో మార్జిన్ ఎక్కువ. అందుకని ఎక్కవ మార్జిన్లు ఉండే విభాగంపైన్నే ద్రుష్టి పెట్టాలన్నది కంపెనీ ప్రణాళికగా తెలుస్తోంది. ఇకపై శాంసంగ్ రిలీజ్ చేసే ఫోన్లు అన్నీ కూడా 15వేలకు పైన్నే ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద తయారీ ప్రోత్సాహకాలు, సబ్సిడీలకు శాంసంగ్ కూడా ఎంపికైంది. వీటి కింద ప్రయోజనాలు పొందాలంటే ఫ్యాక్టరీలోఫోన్ తయారీ ధర 15వేలకు పైన ఉండాలన్నది నిబంధన. కాబట్టి ఈ విధంగానూ ప్రయోజనాలు పొందవచ్చన్నది శాంసంగ్ ఆలోచన.