ఒక్క క్లిక్ తో రూ.9 లక్షలు మాయం.. ఆన్లైన్ లో జాగ్రత్త!

ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా ముందుకు సాగుతోంది. ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అవి రెండూ భాగమైపోయాయి.

  • Written By:
  • Publish Date - December 23, 2022 / 10:12 PM IST

ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా ముందుకు సాగుతోంది. ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అవి రెండూ భాగమైపోయాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని, వినియోగదారులకు అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ నగదును దోచుకుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేస్తూ రూ.9 లక్షలు పోగొట్టుకున్న విషయం వెలుగుచూసింది.

దహిసర్ పోలీస్‌ స్టేషన్‌లో దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇటువంటి సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఆ విధంగా మోసపోయిన వారిలో చదువుకున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. 68 ఏళ్ల పుష్పలత ప్రదీప్ చిందర్కార్ యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి. వాట్సాప్ ద్వారా వచ్చిన ఒక ఫ్రాడ్ లింక్ ను ఆమె ఓపెన్ చేశారు. ఆ సమయంలో తన సేవింగ్స్ అకౌంట్‌ నుంచి రూ.9 లక్షలు మాయం అయ్యింది. ఆమెకు వస్తున్న పెన్షన్ దానిపై వచ్చే వడ్డీతోనే ఆమె జీవిస్తోంది.

తన ఫిక్స్డ్‌ డిపాజిట్‌లో వచ్చిన సమస్య గురించి యూనియన్ బ్యాంక్ గ్రీవెన్స్ సెల్‌కు కంప్లైంట్ చేసే క్రమంలో ఆమె తన డబ్బును పోగొట్టుకున్నారు. కంప్లైంట్‌ చేస్తున్న టైంలో ఆన్‌లైన్‌లో పుష్పలత ప్రదీప్ చిందర్కార్ తన ఫోన్ నంబర్‌ ఎంటర్‌ చేశాక రెండు ఫోన్‌ కాల్స్ ఆమెకు వచ్చాయి. రెండో సారి కాల్ చేసిన వ్యక్తి వాట్సాప్‌కు ఒక లింక్‌ పంపిస్తామని, కంప్లైంట్ చేయడానికి ఒక యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆమెకు సూచించాడు.

ఆ సమయంలో ఆమెకు డౌట్ కూడా వచ్చింది. అయితే ఆ సైబర్ నేరగాడు ఆమెను తన మాటలతో మార్చాడు. అతని మాటలు నమ్మిన పుష్ఫలత ప్రదీప్ చిందర్కార్ ఫోన్ కాల్ లో చెప్పిన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యారు. ఇంటర్నెట్ లో లాగిన్, పాస్ వర్డ్, బ్యాంక్ ఐడీ వివరాలను ఎంటర్ చేశాక ఆమె అకౌంట్ నుంచి రూ.9 లక్షలు మాయం అయ్యాయి. తర్వాత ఆమెకు మెస్సేజ్ రావడంతో నిజం తెలిసి తేరుకుని తన భర్త ఫోన్ నుంచి యూనియన్ బ్యాంక్‌కు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.