- అమాయకపు ప్రజలను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్, క్లిక్ చేస్తే చాల ప్రమాదం
- ‘ఘోస్ట్ పెయిరింగ్’ తో జాగ్రత్త అంటున్న సజ్జనార్
Whatsapp : సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు నిత్యం కొత్త పద్ధతులను వెతుకుతుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ‘ఘోస్ట్ పెయిరింగ్’ అనే కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. “Hey.. మీ ఫొటో చూశారా?” లేదా “మీ గురించి ఎవరో ఇలా పోస్ట్ చేశారు” వంటి ఆసక్తికరమైన మెసేజ్‌లను పంపి, దాని కింద ఒక లింక్‌ను జత చేస్తారు. యూజర్లు ఆత్రుతతో ఆ లింక్‌ను క్లిక్ చేయగానే, వారి వాట్సాప్ అకౌంట్ తెలియకుండానే హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అయిపోతుంది. దీనినే ‘ఘోస్ట్ పెయిరింగ్’ అంటారు. అంటే, మీ ఫోన్ మీ చేతిలోనే ఉన్నా, మీ వాట్సాప్ అకౌంట్ మరొకరి నియంత్రణలోకి వెళ్తుందని అర్థం.
Sajjanar Whatsapp
ఒకసారి మీ అకౌంట్ హ్యాకర్ల డివైజ్‌కు లింక్ అయిన తర్వాత, మీ ప్రైవసీ పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. హ్యాకర్లు మీ వ్యక్తిగత చాట్‌లు, ఫొటోలు, వీడియోలను చూడటమే కాకుండా.. మీ పేరుతో మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపుతారు. “అర్జెంట్‌గా డబ్బులు కావాలి” అని అడగడం లేదా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో బాధితులకు తమ అకౌంట్ వేరే డివైజ్‌లో రన్ అవుతున్న విషయం కూడా తెలియదు. అందుకే దీనిని ‘ఘోస్ట్’ (కనిపించని) పెయిరింగ్ అని పిలుస్తారు.
ఈ స్కామ్ నుండి రక్షణ పొందడానికి హైదరాబాద్ సీపీ కొన్ని కీలక సూచనలు చేశారు. వాట్సాప్ యూజర్లు వెంటనే తమ యాప్‌లోని Settings లోకి వెళ్లి, ‘Linked Devices’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ మీకు తెలియని లేదా మీరు వాడని డివైజ్‌లు (ఉదాహరణకు: Google Chrome, MacOS, లేదా ఇతర వింత పేర్లు) ఏవైనా కనిపిస్తే, వెంటనే వాటిపై క్లిక్ చేసి ‘Log Out’ చేయాలి. అలాగే, తెలియని వ్యక్తుల నుండి వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, అకౌంట్‌కు ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ (Two-step verification) ఎనేబుల్ చేసుకోవడం ద్వారా భద్రతను పెంచుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
