Google AI : ఇంటర్నెట్‌లో సమాచారం వెతకే తీరును ములమూలగా మార్చే దిశగా గూగుల్ మరో కీలక ముందడుగు వేసింది. సెర్చ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా ‘ఏఐ మోడ్’ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొద్ది మంది వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను, ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని ఇంగ్లీష్ వినియోగదారులకు విడుదల చేయనుంది. ముఖ్యంగా ఈ ఫీచర్‌ను వాడటానికి ప్రత్యేకంగా సెర్చ్ ల్యాబ్స్‌లో సైన్ అప్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా గూగుల్ సెర్చ్ బార్‌లోనే పొందవచ్చు.
జెమిని 2.5 ఆధారిత శక్తివంతమైన వ్యవస్థ
ఈ ఏఐ మోడ్ గూగుల్ యొక్క శక్తివంతమైన జెమిని 2.5 మోడల్‌పై పనిచేస్తోంది. ఇది న్యూయార్క్‌లో ఇటీవల ప్రకటించిన గూగుల్ నెక్సస్ అప్‌డేట్స్‌లో భాగంగా విస్తరింపబడింది. ఈ కొత్త విధానం, సంప్రదాయ సెర్చ్‌కు భిన్నంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు, మనం ఏదైనా సమాచారం కోసం అన్వేషించేటప్పుడు అనేక వెబ్‌సైట్ల లింకులు తెరిచి, వాటిలో నుంచి అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియను గూగుల్ ఏఐ మోడ్ స్వయంగా చేయనుంది. అందించాల్సిన సమాధానాన్ని ఒకే చోట సంక్షిప్తంగా, స్పష్టంగా అందిస్తుంది.
సహజ భాషలో ప్రశ్నలు, క్రమబద్ధమైన సమాధానాలు
ఈ ఫీచర్ ప్రధానంగా సహజ భాషను అర్థం చేసుకోవడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు, “ఇంట్లో ఎక్కువ సామాగ్రి లేకుండా 6-8 ఏళ్ల పిల్లలు ఆడేందుకు సరైన ఆటలు ఏమిటి?” అనే ప్రశ్నకు గూగుల్ ఏఐ మోడ్ సరళమైన భాషలో, అనేక సూచనలతో కూడిన సమాధానాన్ని అందిస్తుంది. ఈ విధంగా సమ్మేళనాత్మక ప్రశ్నలకు ఒకే సమాధానంలో స్పష్టతను ఇవ్వగలగడం దీని ప్రత్యేకత.
సంభాషణ కొనసాగింపు, మెమరీ ఫీచర్
ఈ ఏఐ మోడ్ మరో విశేషం సంభాషణను గుర్తుంచుకొని, యూజర్ మునుపటి ప్రశ్నల ఆధారంగా తదుపరి సమాచారం అందించగలగడం. అంటే, ఒక ప్రశ్న అడిగిన తర్వాత దానికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగితే, మునుపటి చర్చను గుర్తుంచుకుని, కొనసాగింపుగా సమాధానం ఇవ్వగలదు. ఇది సాధారణ సెర్చ్‌కు అందని అనుభవాన్ని కలిగిస్తుంది.
వాయిస్, కెమెరా ఆధారిత సెర్చ్‌కు మద్దతు
ఈ ఫీచర్ వాయిస్ కమాండ్స్‌కి పూర్తి మద్దతు అందిస్తుంది. ఫోన్‌ను తాకకుండా, కేవలం మాటల ద్వారా గూగుల్ తో సంభాషించవచ్చు. అంతేకాక, గూగుల్ లెన్స్ సహాయంతో ఫోటో తీసి దానిలో ఏముందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఓ ఫ్లవర్ ఫోటో తీసి దాని జాతి, పెంచే విధానం, సంరక్షణ వివరాలు మొదలైనవి తెలుసుకోవచ్చు.
భారత వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు
రిపోర్టుల ప్రకారం, రానున్న రోజులలో ఈ ఫీచర్ భారతదేశ వినియోగదారులకు గూగుల్ యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది. ప్రధానంగా ఇంగ్లిష్ భాష వినియోగదారులు ఈ సేవను తొలుత పొందగలుగుతారు. తరువాత స్థానిక భాషల మద్దతు కూడా వచ్చే అవకాశం ఉంది. కాగా, సాధారణ సెర్చ్‌కు భిన్నంగా, మనం అడిగే ప్రశ్నకు సంబంధించిన సమగ్ర సమాధానాన్ని ఒకేచోట ఇవ్వగలగడం, సహజ సంభాషణల ద్వారా సమాచారాన్ని పొందగలగడం ఈ ‘ఏఐ మోడ్’ ప్రత్యేకతలు. దీంతో గూగుల్ సెర్చ్ అనుభవం మరింత వేగవంతం, అనుకూలతతో కూడినదిగా మారుతోంది. ఇది నిస్సందేహంగా ఇంటర్నెట్ ఆధారిత సమాచార యాత్రలో ఒక గమనించదగిన మలుపు.