Site icon HashtagU Telugu

Mouse – Space : అంతరిక్షంలో ఎలుకల పిండాలు.. ఏమైందంటే ?

Mouse Space

Mouse Space

Mouse – Space :  అంతరిక్షంలో మనిషి సంతానోత్పత్తి చేయగలడా ? మానవ పిండాలు అంతరిక్షంలో యాక్టివ్‌గా ఉండగలవా ? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ యమనాషి అడ్వాన్స్‌డ్ బయోటెక్నాలజీ సెంటర్, జపాన్ ఏరోస్పేస్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా నిర్వహించిన రీసెర్చ్‌లో ఆసక్తికర వివరాలు వెలుగుచూశాయి. ఈ ప్రయోగంలో భాగంగా సైంటిస్టులు 2021 ఆగస్టులో రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ఎలుకల పిండాలను పంపారు. ఆ పిండాలు అంతరిక్ష వాతావరణంలో మనగలుగుతాయా ? లేదా ? అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ఎలుకల పిండాలను అంతరిక్ష కేంద్రంలో నాలుగు రోజుల పాటు ఉంచారు. అక్కడున్న మైక్రో గ్రావిటీ (గురుత్వాకర్షణ లేని) పరిస్థితులలోనూ ఎలుకల పిండాలు వాటి సహజత్వాన్ని కోల్పోలేదని తేలింది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న టైంలో ఎలుకల పిండాలలో ఎలాంటి ప్రతికూల మార్పు జరగలేదని వెల్లడైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈవివరాలను యూనివర్సిటీ ఆఫ్ యమనాషి అడ్వాన్స్‌డ్ బయోటెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ తెరుహికో వాకయామా వెల్లడించారు. నాలుగు రోజుల టైం తర్వాత ఆ ఎలుకల పిండాలను భూమికి తిరిగి పంపగా.. వాటి డీఎన్ఏను టెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష కేంద్రానికి పంపడానికి ముందు ఆ ఎలుకల  డీఎన్ఏ రిపోర్టులలో.. అంతరిక్ష కేంద్రంలో నాలుగు రోజులు ఉండి వచ్చిన వెంటనే తీసిన డీఎన్ఏ రిపోర్టులలో పెద్దగా తేడాలు కనిపించలేదని చెప్పారు. దీన్నిబట్టి పాలిచ్చి పిల్లల్ని పెంచే జాతికి చెందిన జీవాలన్నీ, మనుషులతో సహా అంతరిక్షంలో సంతానోత్పత్తి చేయగలవని తేలిందని స్పష్టం చేశారు.  ఫ్యూచర్‌లో  ఇతర గ్రహాలపై ఏర్పాటయ్యే మానవ స్థావరాలలో జీవించేందుకు అవసరమైన పద్ధతులను తెలుసుకునేందుకు ఇలాంటి ప్రయోగాల నివేదికలే గైడ్ లాగా పనిచేస్తాయన్నారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక అమెరికా సైన్స్ జర్నల్ iScienceలో పబ్లిష్ అయింది.

Also Read: Water Cost : వాటర్ బాటిల్ ఇక్కడ రూ.16.. అక్కడ రూ.347.. ఎందుకు ?